
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి చేస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ మమతా బెనర్జీ, కేజ్రీవాల్, మాయావతి వంటి కీలక నేతలతో సమావేశమయ్యారు. వారితో థర్డ్ ఫ్రంట్ గురించి చర్చలు జరిపారు. ప్రాంతీయ పార్టీల బలోపేతంపై మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రావాల్సి ఉండగా కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ ఉన్న కారణంగా ఆయన రాలేదనే టాక్ వినిపిస్తోంది. నిన్ననే బెంగళూరు వెళ్లిన కేసీఆర్ కుమార స్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేసీఆర్ లేకపోవడాన్ని బాగా వినియోగించుకున్న చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కీలక నాయకులతో చర్చించి పైచేయి సాధించారు. ఇక్కడ కేసీర్ లేకపోవడం కొంతవరకు చంద్రబాబుకు ఎంత ప్లస్సో కేసీఆర్కు అంత మైనస్సని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ వ్యూహాత్మకంగానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అయితే ఈ అవకాశాన్ని చంద్రబాబు చక్కగా ఉపయోగించుకున్నారు. కేంద్రంలో మరోసారి చక్రం తిప్పే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ సంగతి పక్కనపెట్టి మిగతా ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించారు. యూపీఏ, ఎన్డీయే కాకుండా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే కర్ణాటకలో మాదిరిగా కాంగ్రెస్ సాయం మాత్రం తీసుకోవాలని, పై చేయి ప్రాంతీయ పార్టీల కూటమే ఉండాలనేది నేతల ప్లాన్.
This post is also available in : English
Be the first to comment