యూట్యూబ్‌పై ఈజిప్ట్‌లో నెల రోజుల నిషేధం

వీడియో ఫైల్ షేరింగ్ సైట్ యూట్యూబ్‌ను నెల రోజులపాటు నిషేధించాలంటూ ఈజిప్ట్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్త ప్రతిష్ఠను దిగజార్చేలా 2012లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వివాదాస్పద చిత్రానికి సంబంధించిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కేసు వేసిన న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు సమాచార, మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ గూగుల్ ఆధ్వర్యంలోని యూట్యూబ్‌ను నిషేధించాల్సిందిగా ఆదేశించింది.

అప్పట్లో ఈ వివాదంపై మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. కోర్టు తీర్పును అమలు పరచడం దాదాపు అసాధ్యమని పేర్కొంది. గూగుల్ ఇంటర్నెట్ సెర్చింజన్‌కు అంతరాయం కలిగించకుండా నిషేధం విధించడం సాధ్యం కాదని, అదే కనుక చేస్తే ఈజిప్ట్‌లోని లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించింది. తాజాగా, కోర్టు ఆదేశాల తర్వాత కూడా శనివారం ఈజిప్టులో యూట్యూబ్ కార్యకలాపాలు కొనసాగాయి.

‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ పేరుతో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ సినిమానిర్మించారు. ఇందులో మహమ్మద్ ప్రవక్త ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా సన్నివేశాలు ఉండడంతో ఈజిప్టు సహా ఇతర ముస్లిం దేశాలలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. ఈ అల్లర్లలో 30 మందికిపైగా మరణించారు. దీంతో ఈ సినిమాపై 2013లో మహమ్మద్ హమీద్ సలీం అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం శనివారం తీర్పు చెబుతూ నాటి వీడియోపై నెల రోజులపాటు నిషేధం విధించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ సినిమాకు సంబంధించి అన్ని లింకులను బ్లాక్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించినట్టు సలీం పేర్కొన్నారు. దీనిని తుది తీర్పుగా భావించాలని, అప్పీలు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*