అక్కడికి వెళ్లకండి ప్లీజ్… ప్రణబ్‌ను వేడుకుంటోన్న కాంగ్రెస్ నేతలు

నాగ్‌పూర్‌లో జూన్ ఏడున జరిగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్నారని తెలిసినప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లొద్దంటూ ప్రణబ్‌కు మాజీ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ లేఖ రాశారు. ప్రణబ్ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. పునరాలోచించుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందంటూ షరీఫ్ వాపోయారు. అయితే షరీఫ్ లేఖపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది.

మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ రావడం శుభారంభమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రాజకీయాల్లో అంటరానితనం తగదన్నారు. అటు ప్రణబ్ తమ ఆహ్వానాన్ని మన్నించడంపై ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. గతంలో మహాత్మాగాంధీ, జయప్రకాశ్ నారాయణ్ తమ సమావేశాలకు హాజరయ్యారని, ఆర్ఎస్ఎస్ చేస్తున్న చేస్తున్న కార్యక్రమాలను మెచ్చుకున్నారని గుర్తు చేసింది. 1963లో చైనా యుద్ధం సమయంలో ఆర్ఎస్ఎస్ చేసిన గొప్ప సేవలకు ముగ్ధుడైన నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తమ కార్యకర్తలను రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానించి పాల్గొనేలా చేశారని ఆర్ఎస్ఎస్ గుర్తు చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*