టార్గెట్ 2019.. ఆప్, కాంగ్రెస్ దోస్తీ

న్యూఢిల్లీ: 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చేతులు కలపనున్నాయా? తాజా పరిణామాలు చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. అందుకే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రశంసలు కూడా కురిపించారు. మన్మోహన్‌లాంటి విద్యావంతుడు దేశ ప్రధానిగా ప్రస్తుతం లేకపోవడం దురదృష్టకరమంటూ ట్వీట్ కూడా చేశారు.

అటు బీఎస్పీ ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోరాడాలని జేడీఎస్, కాంగ్రెస్ నిర్ణయించుకున్నాయి. ఎన్నికల నాటికి బీఎస్పీ కూడా జేడీఎస్, కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం ఉంది.

తాజాగా కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో దోస్తీకి తహతహలాడుతున్నారు. త్వరలో రాహుల్‌తో భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై కూడా చర్చిస్తారు. ఈ దోస్తీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే కేజ్రీవాల్ గతంలో యూపీఏ సర్కారు అవినీతిపై జాతీయ స్థాయిలో అన్నాహజారే ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. అదే కేజ్రీవాల్ నేడు అదే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారు. నాడు మన్మోహన్‌ను ధృతరాష్ట్రుడిగా పోల్చిన కేజ్రీవాల్ నేడు ఆర్ధిక నిపుణుడంటున్నారు. అలాంటి విద్యావంతుడైన ప్రధాని నేడు దేశానికి నాయకత్వం వహించకపోవడం విచారకరమంటూ ట్వీట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ అంశంపైనే కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు ప్రారంభించింది. నాడు యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సహకరించారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మన్మోహన్‌ను నాడు విమర్శించినందుకు నేడు కపిల్ సిబాల్‌, చిదంబరం, పవన్ ఖేరా, షీలాదీక్షిత్‌లకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు.

ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా మోదీ బూచితో కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ అనైతిక పొత్తు ఆరంభం నుంచే ఉందని, ప్రస్తుతం బహిరంగంగానే చేతులు కలుపుతున్నారని బీజేపీ వ్యాఖ్యానించింది. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలపడం మోదీకి 2019లో ముమ్మాటికీ పెద్ద సవాలుగా మారుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*