
అతి తక్కువ ధరలో అత్యద్భుతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు మొటొరోలా సిద్ధమైంది. నేడు ఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమంలో మోటో జీ6, మోటో జీ6 ప్లే మొబైల్స్‌ను లాంచ్ చేయనుంది. నెలన్నర క్రితమే బ్రెజిల్లో వీటిని ఆవిష్కరించిన మొటొరోలా తాజాగా వీటిని ఇండియాలో విడుదల చేస్తోంది. మోటో జీ6 అమెజాన్‌లో మాత్రమే లభించనుండగా, జీ6 ప్లే ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే పొందే వీలుంది.
మోటో జీ6 లాంచింగ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో ఇంట్లో కూర్చునే దీని ఫీచర్లను గమనించవచ్చు. మోటో జీ6, జీ6 ప్లే మొబైల్స్‌కు లాంచింగ్ ఆఫర్లు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇదే హైలెట్ కానుంది. మోటో జీ6 ధర దాదాపు రూ.16,500 ఉండనుండగా, జీ6 ప్లే ధర రూ. 13 వేలు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్లు షియోమీ రెడ్ మీ నోట్ 5, రోడ్మీ నోట్ 5 ప్రొ, రియల్మీ 1, ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
మోటో జీ6లో 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యూయల్ నానో సిమ్, 12 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తదితర ఫీచర్లు ఉండనున్నాయి.
మోటో జీ6 ప్లేలో 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియా ఓఎస్, డ్యూయల్ నానో సిమ్, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 13 మెగాపిక్సల్ రియర్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.
Be the first to comment