రెచ్చిపోయిన రషీద్ ఖాన్.. ఐదు బంతుల్లో మూడు వికెట్లు!

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ మరోమారు చెలరేగిపోయాడు. ఐదు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పుట్టి ముంచాడు. మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్న రషీద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీతీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బంగ్లా జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ చేసిన 43 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. రషీద్ ఖాన్ మరోమారు అద్భుతమైన బౌలింగ్‌‌తో బంగ్లాదేశ్‌ను వణికించాడు. రషీద్ నిప్పులు చెరిగే బంతుల ముందు బంగ్లా ఆటగాళ్లు నిలబడలేకపోయారు. 15వ ఓవర్‌లో తొలి ఐదు బంతుల్లో మూడు వికెట్లు తీసి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన రషీద్ 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా 32 టీ20ల్లో 56 వికెట్లు తీసుకున్న రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

అనంతరం 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమియుల్లా షెన్వారీ 49 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. నాలుగు వికెట్లు తీసిన రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో టీ20 గురువారం జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*