సోనాలి బింద్రేకు కేన్సర్.. అమెరికాలో చికిత్స

పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే కేన్సర్ బారిన పడింది. తాను కేన్సర్ బారినపడినట్టు బుధవారం ఆమె స్వయంగా పేర్కొంది. ప్రస్తుతం తాను న్యూయార్క్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని, కోర్సు వాడుతున్నానని తెలిపింది. కేన్సర్‌తో తాను పోరాడతానని, తిరిగి పూర్తి ఆరోగ్యంతో వస్తానని పేర్కొంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సంపూర్ణ మద్దతు ఉందని, తన వెనక వారు ఉన్నారని సోనాలి వివరించింది.

హై గ్రేడ్ కేన్సర్‌కు చికిత్స పొందుతున్నట్లు ఆమె తన ట్విటర్ అకౌంట్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. కేన్సర్‌తో పోరాడుతున్న తనకు మద్దతుగా నిలిచిన సినీ పరిశ్రమ, సన్నిహితులు, అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కేన్సర్‌ వచ్చిందని కుంగిపోకుండా దానిపై పోరాడటమే సరంటూ ఆమె స్ఫూర్తిని చాటుకుంటున్నారు. తమ అభిమాన నటికి కేన్సర్ అని తెలియడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సోనాలి బింద్రే తెలుగులో పలువురు అగ్రహీరోలతో నటించి విజయాలు అందుకుంది. మహేశ్‌బాబుతో మురారీ, నాగార్జునతో మన్మథుడు, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు, చిరంజీవితో ఇంద్ర సినిమాల్లో నటించింది.

సొనాలి బింద్రే తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గంలో నటించారు. శ్రీకాంత్‌తో కలిసి ఆమె నటించిన నువ్వు నువ్వు అనే పాట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సోనాలి బింద్రే హిందీ, తెలుగుతో పాటు తమిళ్, మరాఠీ, కన్నడ సినిమాల్లో నటించారు. 1975 జనవరి ఒకటిన జన్మించిన సొనాలి వెంగళూరు, డెహ్రాడూన్, పూణేల్లో చదువుకుంది. మోడలింగ్‌ కెరీర్‌గా ప్రారంభించినా సినిమా అవకాశాలు తట్టడంతో బిజీ స్టార్‌గా మారారు. 2002లో దర్శకుడు గోల్డీ బెహల్‌ను ఆమె వివాహమాడారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం సొనాలి సినిమాలతో పాటు టెలివిజన్ ప్రోగ్రామ్స్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*