కాళేశ్వరమంత వేగంగా పాలమూరు రంగారెడ్డి

కేసులన్నీ కొలిక్కి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. జల సౌధలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులపై సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. ఇంజినీర్లకు అవసరమైన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ -1 లో 66 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనికి గాను 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి చేసినట్లు ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అటవీ భూముల సేకరణకు అవసరమైన రూ. 49 కోట్లును వెంటనే చెల్లించాల మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ-2 లో అంజనాగిరి రిజర్వాయర్ పనుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు. రీచ్ -2 లో ఏర్పడిన మట్టి కొరత సమస్యను అధిగమించడానికి రాక్ ఫిల్ డామ్ విధానంలో పనులు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

ప్యాకేజీ -3 లో ఓపెన్, అప్రోచ్ కెనాల్ పనులు చేపడుతున్నామని ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. ఇందులో 8 కిలోమీటర్లకు గాను3 కిలోమీటర్ల పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ప్యాకేజీ-4 లో రెండు టన్నెల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు వివరించారు. ఇందులో 15 కిలోమీటర్లకు గాను కుడి టన్నెల్ లో 7.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, ఎడమవైపు నాలుగున్నర కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్యాకేజీ-5 లో తీగలపల్లి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్ పనులు జరుగుతున్న తీరుపట్ల మంత్రి హరీశ్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్యాకేజీ-6లో వీరాంజనేయ రిజర్వాయర్, అప్రోచ్, ఓపెన్ కెనాల్ పనులు నిర్వహిస్తున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ప్యాకేజీ -7 కింద రెండు టన్నెల్స్ నిర్మాణం చేపడుతున్నామని ఇందులో కుడి టన్నెల్ 1.5 కిలోమీటర్లు పూర్తయిందని ఇంజనీర్లు వివరించారు. ప్యాకేజీ-8లో భాగంగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్ పనులు జరుగుతున్న తీరుపైన మంత్రి కొంత సంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీ-9 కింద వెంకటాద్రి రిజర్వాయర్ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రికి వివరించారు.

ఇక ప్యాకేజీ-10, ప్యాకేజీ 11 లో వెంకటాద్రి రిజర్వాయర్ పనులు ఉన్నాయని వీటిలో భూసేకరణ , ఆర్ అండ్ ఆర్ సమస్యలు మిగిలి ఉన్నాయని అధికారులు చెప్పారు. రిజర్వాయర్ బండ్ పనులపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి ఇంజనీర్లకు సూచించారు. ఇక ప్యాకేజీ-12 లో ఓపెన్, అప్రోచ్ కెనాల్ పనులు నిర్విహిస్తున్నామని, ఇందులో కోటీ 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనికి గాను, కోటీ 5 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయిందని మంత్రికి వివరించారు.

ప్యాకేజీ 13, 14,15 కింద కర్వెన రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రి హరీశ్ రావుకు వివరించారు. ఈ ప్యాకేజీలో నాలుగున్నర కిలోమీటర్ల వరకు బండ్ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ల పనుల విషయంలో అత్యంత అప్రమత్తత పాటించాలని మంత్రి ఇంజనీర్లును ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు.

ప్యాకేజీ 16 కింద ఉద్దండాపూర్ పంప్ హౌస్, ప్యాకేజీ 17,18 కింద ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు వివరించారు. ఇందులో 17 కిలోమీటర్ల టన్నెల్ కు గాను 4 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని, ఇంకా 13 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉందన్నారు. భద్రత విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రక్షణ ఏర్పాట్లతోనే పనులు జరిపేలా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*