ఇంతకూ రాహుల్ గాంధీ చేసింది కరెక్టా..? కాదా..?

అవిశ్వాసంపై దద్దరిల్లిపోతున్న లోక్ సభను రాహుల్ గాంధీ ఒక్కసారిగా కూల్ చేశారు. ఆయ చేసిన పనికి ప్రధాని సహా సభ్యులంతా స్థాణువైపోయారు. అప్పటిదాకా మోదీని తీవ్రంగా విమర్శించిన రాహుల్- ప్రసంగం చివర్లో ప్రధాని దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఆ క్షణంలో ప్రధాని మోదీ విస్తుపోయారు. రాహుల్ తిరిగి వెళ్లేదాకా, ఎందుకిలా చేశాడో అర్ధం కాలేదు. తర్వాత తేరుకుని, రాహుల్ ని వెనక్కిపిలిపించి షేక్ హాండిచ్చారు. భుజం తట్టి అభినందించారు. రాహుల్ మోదీల ఆత్మీయ పలకరింపులను పక్కనే ఉన్న రాజ్‌ నాథ్ సింగ్, అడ్వానీ ఆసక్తిగా గమనించారు.

ఇంత వరకు బాగానే ఉన్న ఆ తర్వాత రాహుల్‌ చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రధానితో షేక్‌హ్యాండ్ తర్వాత తన స్థానానికి వచ్చి కూర్చున్న రాహుల్‌…తమ పార్టీ సభ్యుల వైపు చూస్తూ నవ్వి కన్ను గీటారు. ఈ చర్యను స్పీకర్ సుమిత్రా మహజన్ తప్పుబట్టారు. మోడీని ఆలింగనం చేసుకోవడం, అనంతరం కన్ను కొట్టడం తదితర చర్యలు సభా సంప్రదాయాలను కాలరాయడమే అన్నారామె. ప్రధానితో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదన్నారు. మోడీ స్థానంలో ఎవరున్నా ఆ పదవిని గౌరవించాలని స్పీకర్ హితవు పలికారు. కొడుకులాంటివాడైన రాహుల్ తప్పుల్ని ఎత్తిచూపడం తన బాధ్యతన్న స్పీకర్… అధికార, విపక్ష సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

రాహుల్ గాంధీ చర్యను బీజేపీ నేతలు సహా పలువురు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి చిన్న పిల్లాడిలా వ్యవహారించారని మండిపడ్డారు. సభలో కొత్త సంప్రదాయాలు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలోనూ రాహుల్ చర్యపై జోకులు పేలాయి. కొంతమంది రాహుల్ ను సమర్థిస్తూ కామెంట్లు చేయగా.. మరికొంత మంది మాత్రం ఆయన మరింత పరిణితి సాధించాలని సలహా ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*