ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి, వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చిన టాలీవుడ్ హీరో

అర్జున్ రెడ్డి తర్వాత బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. రియల్ లైఫ్ లోనూ అంతే అగ్రెసివ్‌ గా దూసుకుపోతున్నాడు. తాజాగా తనకు వచ్చిన తొలి ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి, వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. దానికి సంబంధించిన 25 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీ రామారావుకు అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి క్యాంప్ కార్యాలయానికి వచ్చి కేటీఆర్‌ తో సుదీర్ఘంగా ముచ్చటించారు. తొలి ఫిలింఫేర్ అవార్డును వేలంవేసి, 25 లక్షల భారీ విరాళం అందించిన విజయ్ దేవరకొండను మంత్రి అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా మంత్రి విజయ్ ని కోరారు. దీంతోపాటు పురపాలక శాఖ తరపున చేపట్టిన జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంలోనూ పాల్గొని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కేటీఆర్ ఆయన్ని కోరారు.
తాను ప్రారంభించిన రౌడీ క్లబ్ మొబైల్ అప్లికేషన్ వివరాలను మంత్రికి విజయ్ దేవరకొండ వివరించారు. అమ్మకాలు జరుపుతున్న వస్త్రాల తయారీనే తెలంగాణలోనే చేపట్టాలని, ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగరానికి దగ్గరలో ఉన్న గుండ్లపోచంపల్లి అపారెల్ పార్కులో ఉన్న వస్త్ర తయారీదారులతో కలిసి పనిచేయాలని సూచించారు. మంత్రి సలహా మేరకు త్వరలోనే ఆయా వస్త్ర తయారీదారులతో సమావేశం అవుతానని విజయ్ దేవరకొండ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*