అమెజాన్ మొదట్లో ఏం అమ్మిందో తెలుసా..?

సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు.. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతకన్నా కాదు. కేవలం వస్తువులను ఆన్ లైన్ లో అమ్మే వ్యాపారం. అయినా బిలియన్ డాలర్లలో ఆదాయం. చిన్న గ్యారేజీలో ప్రారంభమైన బిజినెస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు విస్తరించి సత్తా చాటుతోంది. ఆన్లైన్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతూ.. ఆదాయం విషయంలో దిగ్గజ కంపెనీలతో పోటీ పడుతోంది అమెజాన్.

ఆన్లైన్ బిజినెస్ లో ప్రస్తుతం అమెజాన్‌ను మించింది లేదు. ఆన్ లైన్ స్టోర్ ద్వారా కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను అందుబాటులోకి తెస్తున్న ఈ ఈ కామర్స్ దిగ్గజం.. అంతకంతకూ విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ను పెంచుకుంటోంది. ఆన్ లైన్ మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతున్నా.. సరికొత్త వ్యూహాలతో కస్టమర్లకు దగ్గరవుతోంది. ఆ కారణంగానే ఇప్పుడు అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన సంపద ఇప్పటికి 150 బిలియన్ డాలర్లకు చేరువైంది. 1982 నుంచి ఫోర్బ్స్ మేగజైన్ ఏటా ప్రచురించే బిలియనీర్ల లిస్టులో ఏ ఒక్క శ్రీమంతుడి సంపద 150 బిలియన్ డాలర్లకు చేరలేదంటే అమెజాన్ దూకుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తున్న అమెజాన్ 1994 జులై 5న వాషింగ్టన్‌లోని సీటెల్ ప్రారంభమైంది. ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు. కొంతకాలం పలు కంపెనీల్లో పనిచేసిన ఆయనకు ఇంటర్నెట్ పై అంత పట్టుండేది కాదు. అయితే ఓ రోజు ఈ కామర్స్ రంగం భవిష్యత్తులో 23 వందల శాతం వృద్ధి చెందుతుందంటూ వచ్చిన ఓ నివేదిక ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ నివేదిక ఆధారంగా కేవలం పది వేల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో తన ఇంటిగ్యారేజీలో అమెజాన్ డాట్ కామ్‌కు ప్రాణం పోశాడు. సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా తొలుత తక్కువ ధరకే పుస్తకాలను ఆన్ లైన్ లో అందించడం మొదలుపెట్టిన అమెజాన్ ఆ తర్వాత అంచెలంచెలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. గుండు సూదుల నుంచి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ వరకు ప్రతి వస్తువును కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చి ఈ కామర్స్ రంగంలో విప్లవం తీసుకొచ్చింది.

అమెజాన్ కంపెనీ ప్రారంభమైన రెండు నెలల్లోనే 50 రాష్ట్రాలతో పాటు 45 దేశాల్లో కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కొద్ది రోజుల వ్యవధిలోనే అమెజాన్ అమ్మకాలు వారానికి 20 వేల డాలర్లకు చేరాయి. 1995 అక్టోబర్ లో పబ్లిక్ ఆఫరింగ్ కు వెళ్లిన కంపెనీ.. 1997 మే 15న నాస్ డాక్ లో షేర్ ధరను 18 డాలర్లుగా నిర్ణయించి ఐపీఓకు వెళ్లింది. ప్రపంచంలోనే అతిపెద్ద బుక్ స్టోర్ అనే అమెజాన్ ప్రచారం చేసుకోవడంతో 1997లో కంపెనీపై కేసు దాఖలైంది. 1998 అక్టోబర్‌లో తమ మాజీ ఉద్యోగుల్ని నియమించుకుని ట్రేడ్ సీక్రెట్స్‌ను దొంగిలిస్తోందన్న కారణంతో వాల్ మార్ట్ అమెజాన్ ను కోర్టుకీడ్చింది. అయితే ఈ రెండు కేసుల్ని అమెజాన్ కోర్టు బయట పరిష్కరించుకుంది.

కంపెనీ ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత అమెజాన్ సొంతంగా పబ్లిషింగ్ ప్రారంభించి కొన్ని పుస్తకాలు ప్రచురించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. ఆన్ లైన్ కామర్స్ రంగంలో విప్లవం సృష్టించిన బెజోస్‌ను 1999లో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. వాస్తవానికి అమెజాన్ ను ప్రారంభించిన నాలుగైదేళ్ల వరకు సంస్థ ఎలాంటి లాభాలు కళ్ల చూడలేదు. కేసులు, ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అమెజాన్ 2000 సంవత్సరంలో కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు వీలైనన్ని ఎక్కువ వస్తువులను అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించింది. దీంతో అమ్మకాలు పెరిగి కంపెనీ కాస్త గాడిన పడింది. 21వ శతాబ్దం ప్రారంభంలో డాట్ కామ్ బుడగ పేలడంతో చాలా వరకు ఈ కామర్స్ కంపెనీలు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ అలాంటి సమయంలోనూ అమెజాన్ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడింది. ఆన్ లైన్ రిటైలింగ్ లో తన స్థానాన్ని పదిల పరుచుకుంది. ఫలితంగా 2001 నాల్గో త్రైమాసికంలో కంపెనీ తొలిసారి లాభాలు చవిచూసింది. ఆ తర్వాత అమెజాన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంరాలేదు.

రెండు దశాబ్దాల క్రితం కేవలం ఒకే ఒక్కరితో ప్రారంభమైన అమెజాన్ కంపెనీ కాలక్రమంలో అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో విస్తరించింది. ఆసియాలో చైనా, ఇండియా, జపాన్, సింగపూర్, యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, నార్త్ అమెరికాలో కెనడా, మెక్సికో , సౌత్ అమెరికాలో బ్రెజిల్ తో పాటు ఆస్ట్రేలియాలోనూ అమెజాన్ దూసుకుపోతోంది. 2015 నాటికి అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ ను దాటేసిన అమెజాన్.. సాఫ్ట్ వేర్ దిగ్గజాలతో పోటీ పడుతోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం యాపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ తర్వాత ప్రపంచంలో నాలుగవ అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్ నిలిచింది. ఇక రెవెన్యూ విషయంలో లార్జెస్ట్ ఇంటర్నెట్ కంపెనీ అయిన అమెజాన్.. సేల్స్ విషయంలో ఈ కామర్స్ జెయింట్ అలీబాబా తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. 2011 నాటికి అమెజాన్ లో 30 వేల మంది ఫుల్ టైం ఎంప్లాయిస్ ఉండగా.. 2016 నాటికి ఆ సంఖ్య లక్షా 80 వేలకు చేరింది. ఈ ఏడాది జనవరి వరకు అమెజాన్ లో మొత్తం 3లక్షల 6వేల 800 మంది పుల్, పార్ట్ టైం ఎంప్లాయిస్ పనిచేస్తున్నారు. 2018 జనవరి 22న అమెజాన్ చెక్ ఔట్ అవసరంలేని అమెజాన్ గో స్టోర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్టోర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించి మరిన్ని చోట్ల ప్రారంభించాలని యోచిస్తోంది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ ఆదాయం 2017లో 177.86 బిలియన్ డాలర్లు కాగా.. ఆస్తుల విలువ 131.31 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం భారత్ ఈ కామర్స్ రంగంలో అమెజాన్ రాజ్యమేలుతోంది. 2013 జూన్‌లో భారత్ లో అడుగుపెట్టిన అమెజాన్.. తొలుత బెంగళూరు, హైదరాబాద్ పై దృష్టి పెట్టింది. ఆ తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అమెరికా వెలుపల అతిపెద్ద గోదాంను నిర్మించాలని నిర్ణయించిన కంపెనీ అందుకు హైదరాబాద్ ను వేదికగా మార్చుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ ఇండియా ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 105శాతం మేర పెరిగిందంటే సంస్థపై కస్టమర్లకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*