పాతికేళ్ల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న బైరెడ్డి

న్యూఢిల్లీ: బైరెడ్డి రాజశేఖరెడ్డి తన పూర్వాశ్రమానికి చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి బైరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు రాహుల్. 1993లో బైరెడ్డి కాంగ్రెస్ లో క్రియశీలకంగా పనిచేశారు. రాయలసీమ వెనుకబాటుతనంపై కొట్లాడిన బైరెడ్డి, కాంగ్రెస్‌ ని వీడి 1994 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టారు. 2013లో రాయలసీమ పరిరక్షణ సమితినే పార్టీగా ప్రకటించారు.

విభజన సమయంలో రాయలసీమ హక్కులపై తీవ్రంగా పోరాడిన బైరెడ్డి, ముక్కుసూటి మనిషి. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవారు. కానీ ఆయన దూకుడు సీమ రాజకీయాల్లో నిలబడనీయలేదు. విభజన తర్వాత కొంతకాలం వార్తల్లో కనిపించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ బైరెడ్డి కాంగ్రెస్ పార్టీ నీడకు చేరాడు. పాతకాపు అయిన బైరెడ్డిని కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానించింది.

ఆగస్టులో కర్నూల్లో పెట్టబోతున్న బహిరంగ సభకి రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు బైరెడ్డి తెలిపారు. పార్టీలోకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాకతో బలం చేకూరిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. 2019లో ఏపీలో, అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అందరం కృషి చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుస్తామని బైరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ నుంచే విజయకేతనం ఎగరవేస్తామని రఘువీరా ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు బీజేపీతో టీడీపీ కాపురం చేసి వదిలేసిందని, ఇప్పుడు జగన్ పట్టుకున్నాడని బైరెడ్డి విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్ కి హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*