డ్రోన్ టాక్సీలు కూడా వస్తున్నాయోచ్ !!

డ్రోన్ అంటే కేవలం బర్డ్ ఐ వ్యూ కెమెరా మాత్రమే కాదు. రోబోల్లాగే ఇవి కూడా మనుషులకు ఎందులోనూ తీసిపోవు. మిలటరీ నుంచి అగ్రికల్చర్ దాకా అన్నింటికీ ఇప్పుడు డ్రోన్లే వాడుతున్నారు.

డ్రోన్! అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్. గాల్లో ఎగిరే మానవ రహిత వాహనాలు సర్క్యూట్ బోర్డ్, చిప్ సెట్, సాఫ్ట్ వేర్ ఆధారంగా పనిచేస్తాయి. డ్రోన్లో రెండు భాగాలుంటాయి. ఒకటి గాల్లో ఎగిరే డివైజ్. రెండోది దాన్ని కంట్రోల్ చేసే పరికరం. డ్రోన్లలో నైట్ విజన్ కెమెరాలు, జీపీఎస్ కూడా ఉంటుంది. ఇలాంటి వాటిని ఎక్కువగా మిలటరీ ఆపరేషన్స్ కోసం వాడుతుంటారు. గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించేలా లైట్ వెయిట్ పరికరాలతో డ్రోన్లను తయారు చేస్తారు.

నిజానికి 15 ఏళ్ల ముందు నుంచే విదేశాల్లో డ్రోన్లు వాడుతున్నారు. డ్రోన్లను తయారుచేసిన మొట్టమొదటి దేశం ఇజ్రాయల్. ఆఫ్రికా ఏజెన్సీ ఏరియాలకు సకాలంలో మందులు చేర్చి ఎన్నో ప్రాణాలను నిలబెట్టాయి డ్రోన్లు! ఇండియాలోకి ఇప్పుడిప్పుడే డ్రోన్లు ఎంటరవుతున్నాయి. మిలటరీ, పోలీసు శాఖ, సర్వేయింగ్, మైనింగ్, రైల్వే ప్రాజెక్టుల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. వ్యవసాయంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

పంట ఏ దశలో ఉంది? ఎంత ఆరోగ్యంగా పెరుగుతోంది? చీడపీడలేమైనా ఉన్నాయా? లాంటి ఔట్ పుట్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా డ్రోన్లు ఉన్నాయి. ఈ ప్రక్రియను సర్వేయింగ్ ఇంటలిజెన్స్ ప్లాట్ ఫామ్ అంటారు. ఇక రెండోది ఆటోమేషన్ డ్రోన్లు. ఇవి పొలంలో ఎరువులు జల్లుతాయి. పురుగు మందులు స్ప్రే చేస్తాయి. ఇవికాకుండా ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రకృతి విపత్తులప్పుడు పనిచేసే డ్రోన్లు కూడా ఉన్నాయి. అయితే, ఇండియాలో డ్రోన్ కెమెరాల వినియోగంలో కొన్ని ఆంక్షలు లేకపోలేదు. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి రావాలంటే మరో రెండేళ్లయినా పడుతుందంటున్నారు థానోస్ టెక్నాలజీస్ ఫౌండర్ ప్రదీప్.

హైదరాబాద్ కు చెందిన థానోస్ కంపెనీ అగ్రికల్చర్ డ్రోన్స్ తయారు చేస్తోంది. వీళ్లు తయారు చేసిన డ్రోన్లు పొలంలో ఎరువులు జల్లుతాయి. పెస్టిసైడ్లను స్ప్రే చేస్తాయి. మాన్యువల్గా పురుగు మందులు జల్లితే కొన్ని సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. వాటివల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. ఆ ఉద్దేశంతోనే థానోస్ కంపెనీ అగ్రికల్చర్ ఆధారిత డ్రోన్లను తయారు చేశారు. డ్రోన్లు, వాటి బ్యాటరీలను కూడా వీళ్లే తయారు చేస్తారు.

బయటి వాటితో పోలిస్తే థానోస్ కంపెనీ డ్రోన్లు 40 నిమిషాల వరకు గాల్లో ఎగురుతాయి. వీటిలో ఐదు, పది, పదిహేను లీటర్ల కెపాసిటీ గల డ్రోన్లు ఉన్నాయి. ఎకరం పొలానికి పావుగంటలో పురుగు మందులు చల్లేస్తాయి. డ్రోన్ల వినియోగం ఎంతగా పెరిగిందంటే.. బిల్డింగులకు పెయింట్ కూడా వాటితోనే వేస్తున్నారు. పెళ్లిళ్లలో డ్రోన్ కెమెరాల సందడి గురించి చెప్పాల్సిన పన్లేదు. అమెజాన్ లాంటి సంస్థలు డెలివరీ కోసం కూడా డ్రోన్లు వాడుతున్నాయి.

భవిష్యత్తులో డ్రోన్ ట్యాక్సీలు కూడా రాబోతున్నాయి. వీటి విషయంలో దుబాయ్ఇంట్రస్ట్ చూపిస్తోంది. ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ఎంత దూరమైనా ప్రయాణించేలా డ్రోన్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. ఫైర్ ఫైటింగ్, ట్రాన్స్ పోర్టేషన్.. ఇలా అన్ని రకాల పనులకూ డ్రోన్లే వాడినా ఆశ్చర్యం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*