మూడున్నర కోట్లమందికి ఉచిత కంటి పరీక్షలు

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. గవర్నర్ నరసింహన్ ను కూడా ఒక ప్రాంతంలో పరీక్షా శిబిరాన్ని ప్రారంభించాలని సీఎం కోరబోతున్నారు.

అదేరోజు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను కాబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు అందివ్వాలని, ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 3.70 కోట్ల మంది పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమ నిర్వహణపై సమీక్ష ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ కోసం 799 బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ టీంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఆప్తోమేట్రిస్ట్, ఎఎన్ఎం ఉంటారు. ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుంది. 34 లక్షల కంటి అద్దాలు కూడా రెడీ చేసి జిల్లాలకు పంపుతున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించారు.

వర్షం వచ్చినా సరే కంటి పరీక్షలు నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో పాఠశాల భవవాన్ని కానీ, మరేదైనా పక్కా భవనాన్ని కాని ఎంపిక చేసుకుంటారు. కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగకుండా చూసుకుంటారు. శిబిరంలో పనిచేయడానికి ఎంబిబిఎస్ పూర్తిచేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకుంటారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిని కదిలించరు. ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. కంటి పరీక్షలపై అవగాహన కల్పిస్తారు. ఆ బాధ్యత ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు చూసుకుంటారు.
వైద్య శిబిరాల్లో పాల్గొనే సిబ్బందికి వారానికో రెండు రోజులు కచ్చితంగా సెలవులు ఇస్తారు. వచ్చి, పోవడానికి ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో సరైన వసతి ఉండే అవకాశం ఉండదు కాబట్టి సమీప పట్టణాల్లో షెల్టర్ ఇస్తారు. ప్రభుత్వ అతిధి గృహాలతో పాటు సింగరేణి, విద్యుత్ సంస్థల గెస్ట్ హౌజులను వాడుకుంటారు. ప్రైవేటు హోటళ్లలో కూడా బస ఏర్పాటు చేస్తారు. దగ్గరిచూపు లోపం ఉన్న వారికి వెంటనే మందులు, అద్దాలు అందిస్తారు. ఇతరులకు డాక్టర్లు సూచించిన అద్దాలు పంపిణీ చేస్తారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దశల వారీగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు.

నగరంలోని సరోజిని కంటి ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించడంతో పాటు అన్ని రకాల ఆధునిక వసతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. సరోజిని కంటి ఆసుపత్రికి దేశ వ్యాప్తంగా మంచి పేరు, ప్రతిష్టలున్నాయని, దానికి తగినట్లు కొత్త భవనాలు నిర్మించి, రోగులకు వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నగరంలో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి సంఖ్యను మరింత పెంచాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా పేదలు ఎక్కువగ నివసించే మురికి వాడల్లో ఎక్కువ దవఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గవర్నర్ కూడా బస్తీ దవాఖానాలను సందర్శించి అభినందించారని గుర్తు చేశారు. దశల వారీగా బస్తీ దవాఖానాల్లో రోగ నిర్ధారక పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*