సినిమా ఇండస్ట్రీలో కరీంనగర్ జిల్లా వాళ్లు ఇంతమంది ఉన్నారా?!

తెలుగు సినిమాకు పాటకు రెక్క తొడిగి ఎగరేసింది ఎవరంటే – సినారె తప్ప మరో సమాధానం రాదు! బాలీవుడ్‌ ని ఏలిన బాద్‌షా జయరాజ్ కరీంనగర్ ముద్దుబిడ్డ అని చెప్పిన ప్రతీసారీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దువాసి మోహన్ నుంచి తాగుబోతు రమేష్‌ దాకా- సానా యాదిరెడ్డి నుంచి సంపత్ నంది దాకా..ఎందరో కరీంనగర్ బిడ్డలు టాలీవుడ్‌ ని ఏలుతున్నారు. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులపై ప్రత్యేక కథనం!

కరీంనగర్. ఉద్యమాల ఖిల్లే కాదు.. కళలకు కూడా పెట్టని కోట! సినీ కళాకారులకు కొదువ లేదు. నాటి మూకీల నుంచి నేటి డిజిటల్ సినిమాల దాకా ఎందరో కరీంనగర్ బిడ్డలు వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు.. వెలుగుతున్నారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత జయరాజ్, జ్ఞాన పీఠమెక్కిన సినారె మొదలు నేటితరం పత్తి సురెందర్ రెడ్డి, హరీశ్ శంకర్ దాకా ఎందరో నటులుగా, రచయితలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు.

తేనెలొలుకు పాటలతో తెలుగు సినీ వినీలాకాశంలో మెరిసి, జ్ఞానపీఠాన్ని అధిష్టించిన సాహితీవేత్త సినారె. వేములవాడ మండలంలోని హన్మాజీపేటలో జన్మించిన సి.నారాయణరెడ్డి, 1961లో గులేబకావళి చిత్రంతో సినీ అరంగేట్రం చేశారు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ మొదటి పాటతోనే సినీ ప్రేక్షకులు, సాహితీ ప్రియుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత లెక్కలేనన్ని పాటలు, అవార్డులు, రివార్డులు. జిల్లా కీర్తిని ఇనుమడింపజేసినవారిలో సినారె ముందుంటారు.

మూకీలు మొదలు టాకీల వరకు భారతీయ చలన చిత్రరంగాన్ని శాసించిన మహానటుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పైడిపాటి జయరాజ్ ది కరీంనగర్ జిల్లా అని ఈతరం వారికి తెలియకపోవడం బాధాకరం. సెప్టెంబర్ 29, 1909లో కరీంనగర్ లో జన్మించిన జయరాజ్‌.. సరోజిని నాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు మేనల్లుడు. చిన్నతనంలోనే హైదరాబాద్ లో స్థిరపడ్డ జయరాజ్, 19వ ఏటా ముంబై వెళ్లి బాలీవుడ్ రంగప్రవేశం చేశాడు. 1928లో మావేర్కర్ అనే నిర్మాత సినిమాలో అవకాశం కల్పించాడు. నవజీవన్ ఫిల్మ్ సంస్థ నిర్మించిన రస్సేరీ రాణి చిత్రంతో జయరాజ్‌ హీరోగా పరిచయమయ్యాడు. అది మొదలు అనితర సాధ్యమైన రీతిలో సుమారు 300 చిత్రాల్లో నటించారు. మొత్తం మీద 11 మూకీ సినిమాల్లో, 156 టాకీ సినిమాల్లో కథనాయకుడిగా మురిపించి మరిపించాడు . వహీద్-ఏ-ఆజం చిత్రంలో చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర జయరాజ్ ను విశ్వవిఖ్యాత నటుడిని చేసింది. 1980లో భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డునందుకున్న జయరాజ్, 2001లో ముంబైలో కన్నుమూశారు.

ముజ్రీంకౌన్ అనే హిందీ చిత్రంతో సినీవినీలాకాశంలో దూసుకెళ్లిన కేకే మహేందర్ రెడ్డిది కరీంనగర్ మండలం కొత్తపల్లి. నటుడిగా, నిర్మాతగా, పంపిణీదారుగా బాలీవుడ్ లో పేరెన్నికగన్న కేకే, పాప్ కో జలాకర్ రక్ కర్ దూంగా, కాల్ గర్ల్ లాంటి పలు హిందీ చిత్రాలతో పాటు, నా ఇల్లే నా స్వర్గం, తొలిముద్దు లాంటి తెలుగు సినిమాలు కూడా నిర్మించారు. కేకే రెడ్డి సోదరుడు రుషేందర్ రెడ్డి కూడా దర్శకుడే.

తెలుగు చిత్రసీమలో బంగారు నంది అందుకున్న తొలి కరీంనగర్ బిడ్డ బీఎస్ నారాయణ. 1929లో కొత్తపల్లిలో జన్మించిన నారాయణ, దర్శకుడిగా పలు సందేశాత్మక చిత్రాలు నిర్మించారు. జీవిత చరమాంకంలో అంధత్వంతో బాధపడుతూనే మార్గదర్శి అనే సినిమాను తెరకెక్కించారు. 1977లో ఆయన తీసిన ఊరుమ్మడి బతుకులు చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా బంగారు నంది అవార్డు వరించింది. నారాయణ తీసిన 35 సినిమాలు, సామాజిక విలువలకు అద్దం పట్టాయి.. చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమై, శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ, 1994 నవంబర్ 22న మృతిచెందారు.

భారత ప్రభుత్వం నుంచి జాతీయ సమైక్యత అవార్డును అందుకున్న చిత్రం విముక్తి కోసం. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. MLC నారదాసు లక్ష్మణరావు, చొప్పదండి మాజీ MLA కోడూరి సత్యనారాయణ గౌడ్ ఇద్దరు కలిసి నిర్మించి, నటించారు. సహ నిర్మాతలు మన్మధరెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, ఎస్పీ సత్తెన్న, సర్దార్ ప్రీతమ్ సింగ్. ఆ చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్. అందరిదీ కరీంనగర్ జిల్లానే.

ఇక తెరవెనుక నిన్నటి తరం నటీనటులు, సాంకేతిక నిపుణులకూ కొదవేం లేదు. ఏంటి బావా మరీనూ! ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు, సంసారాల మెకానిక్‌, చిరునవ్వుల వరమిస్తావా లాంటి చిత్రాలతో పాటు మంగ్లీ అనే హిందీ సినిమా నిర్మించిన సంగెం వెంకటేశ్వరరావుది కరీంనగర్ జిల్లా. పిట్టల దొర, బ్యాచిలర్స్, కుచ్చికుచ్చి కూనమ్మ చిత్రాలు తీసిన సానా యాదిరెడ్డిది చొప్పదండి.

చంద్రమోహన్, ప్రభ హీరోహీరోయిన్లుగా సంతోషిమాత వ్రత మహత్యం అనే సినిమాని తెరకెక్కించిన నక్కలపేట రాజయ్యది ధర్మపురి. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన భద్రయ్య- శోభన్ బాబును హీరోగా పెట్టి రఘురాముడు అనే సినిమా తీశాడు. జగిత్యాల నుంచి కొందరు ఫైనాన్షియర్లు కలిసి నిప్పురవ్వ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన శారద, ఆదిశేషయ్య అనే నిర్మాతలు మంచికి మారుపేరు అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు.

రాజేంద్ర ప్రసాద్ హీరోగా డామిట్ కథ అడ్డం తిరిగింది అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది గోవర్దన్‌. ఆయనది ఎల్కలపల్లె. కృష్ణ హీరోగా వచ్చిన భోగిమంటలు సినిమా ప్రొడ్యూసర్‌ ప్రభాకర్‌ది కరీంనగరే. ఈశ్వర్ రావు, కే.విజయ నటించిన తరం మారింది అనే సినిమా నిర్మాత కిషన్‌ సొంత జిల్లా కరీంనగరే. రాంమోహన్‌రావు, శ్రీనివాసరావు అనే ఇద్దరు కరీంనగర్ మిత్రులు కలిసి ప్రతిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంభవం అనే సినిమా తీశారు.
ఇక నేటితరం వారిలో తెరవెనుకా, తెరముందూ చాలామందే ఉన్నారు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన చివరి చిత్రం జాబిల్లికోసం ఆకాశమల్లె! ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజనరేంద్రది కరీంనగరే. రోషం బాలుది ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్. అవునన్నా కాదన్నా చిత్రానికి డైరెక్షన్ చేసిన ఎస్కే రఫీక్‌ ది హుస్నాబాద్‌. జై భజరంగబలి, ప్రేమంటే మాదే, సమ్మక్క సారలమ్మ మహత్యం తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన వేముగంటి లింగయ్యది కోహెడ మండలం సముద్రాల. ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయనాయకులు MSR, CH విద్యాసాగర్ రావు -ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్- కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించారు.

బయ్యర్, ప్రొడ్యూసర్, కమెడియన్ దువ్వాసి మోహన్‌ది జగిత్యాల. మిమిక్రీ శివారెడ్డిది రామగుండం. తాగుబోతు రమేశ్‌ది గోదావరి ఖని. కమేడియన్ వేణు సిరిసిల్లవాసి. యాంకర్ ఉదయభాను స్వస్థలం సుల్తానాబాద్. పాటల రచయిత మిట్టపల్లి సురేందర్‌ సొంతూరు జమ్మికుంట. అప్‌ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ లక్ష్మీసాయిది మంథని. మల్లాపూర్‌కి చెందిన శోభలత మేకప్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కేవీ నరేందర్‌, కృష్ణశ్రీ, మల్లారెడ్డి, గుండ మల్లయ్య, సమీరా ఫర్వీద్‌, కరీంనగర్ మున్సిపల్ ఏఈ యాదగిరి క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. అనుకోకుండా ఏం జరిగిందంటే సినిమాని నిర్మించిన బైర్నేని రవిప్రసాదరావుది జగిత్యాల. తీయని కలవో సినిమాను నిర్మించిన బల్మూరి రాంమోహన్‌రావుది జగిత్యాల.
ఇక ఆ మధ్య ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ కు కిక్ ఇచ్చిన దర్శకుడు పత్తి సురేందర్ రెడ్డి, గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను అమాంతం పెంచిన హరీశ్ శంకర్, సినీ ప్రేక్షకులను బృందావనంలో ఓలలాడించిన పైడిపల్లి వంశీ, ఓ మై ఫ్రెండ్ అంటూ ఆకట్టుకున్న వేణు శ్రీరాం, రచ్చతో రాణించిన సంపత్ నంది – ఇలా అందరూ కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డలే. శ్రీరామరాజ్యం సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన కస్తూరి శ్రీనివాస్ కూడా ఈ జిల్లావాడే. పైడిపల్లి వంశీ మాటల్లో చెప్పాలంటే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరిని డైరెక్ట్‌ చేస్తున్నది తెలంగాణ ప్రాంతంవారే.

జమ్మికుంటకు చెందిన పత్తి సురేదర్‌రెడ్డి, ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీ డైరెక్టర్. మొదట కళ్యాణ్ రామ్‌తో అతనొక్కడే, జూనియర్ ఎన్టీఅర్‌తో ఆశోక్, ఊసరవెల్లి- మహేశ్ బాబుతో అతిథి, రవితేజతో కిక్, అల్లుఅర్జున్ తో రేసుగుర్రం లాంటి హిట్ సినిమాలు తీశాడు. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినీ పరిశ్రమకు తనదైన శైలిలో కిక్ కిక్ ఇచ్చిన దర్శకుడు మన సురేదర్ రెడ్డి.

హరీశ్‌ శంకర్‌. ధర్మపురికి చెందిన ఇతను తెలుగుచిత్ర సీమలో సంచలన దర్శకుడు. వరుస ప్లాపు లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చి, ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచిన ఘనత ఈయనదేనంటే అతిశయోక్తి కాదు. షాక్,
మేడిపల్లి మండలం భీమారానికి చెందిన పైడిపెల్లి వంశీ తెలుగ సినీ పరిశ్రమలో మరో సృజనాత్మక దర్శకుడు. ప్రభాస్ హీరోగా మున్నా చిత్రంతో మాస్ ప్రేక్షకులనే కాదు.. ఎన్టీఅర్ హీరోగా బృందావనం తీసి క్లాస్ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. రాంచరణ్ హీరోగా పెట్టి తీసిన ఎవడు సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.

సంపత్ నంది! ఓదెలకు చెందిన ఈ యువ దర్శకుడు ఏమైంది ఈ వేళ, రచ్చ చిత్రాలకు దర్శకత్వం వహించి సత్తా చాటాడు. నిర్మాతగా గాలిపటం చిత్రం కూడా పలువురి మన్ననలందుకుంది. ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లికి చెందిన వేణు శ్రీరాం, తన తొలి చిత్రం ఓ మై ఫ్రెండ్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపాడు. బొమ్మరిల్లు, భద్ర, కొత్త బంగారు లోకం, ఆర్య మున్నా, రామ్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాంటి సినిమాలను నిర్మించిన మధుర శ్రీధర్‌దీ కరీంనగర్ జిల్లే. గోదావరిఖనికి చెందిన కస్తూరి శ్రీనివాస్, శ్రీరామరాజ్యం సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో సినిమాకు డైరెక్షన్ చేయబోతున్నాడు.

కరీంనగర్ జిల్లాలో సినీ స్డూడియో నెలకొల్పి, చిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆ మాటకొస్తే అందమైన లొకేషన్లకూ జిల్లాలో కొదువలేదు. గతంలోనూ ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరిగింది. రాంగోపాల్ వర్మ ఇటీవలే కరీంనగర్ కు వచ్చి ఇక్కడ ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు అన్ని హంగులు ఉన్నాయన్నారు. సుమన్ హీరోగా వస్తున్న త్యాగాల వీణ అనే సినిమా చిత్రం షూటింగ్ ను కరీంనగర్ లో జరుపుకుంది. గతంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రంలో సునీల్ సైకిల్ ఛేజింగ్ సీన్సన్నీ కొత్తపల్లి కెనాల్ దగ్గర షూట్ చేసినవే. జై బోలో తెలంగాణ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను దర్శకుడు శంకర్ ఎల్కతుర్తి సమీపంలో చిత్రీకరించాడు.

జిల్లాలో దిగువ మానేరు జలాశయం, ఉజ్వల పార్కు , డీర్ పార్కు, ఎలగందుల కోట, రామగిరి ఖిల్లాలు, తూర్పు, పశ్చిమ అటవీ ప్రాంతాలు, NTPC, బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ మైన్లు, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వర దేవస్థానాలు, కోటిలింగాల, గోదావరి నదితీరం అన్నీ షూటింగ్ లకు అనువైనవే. కరీంనగర్ జిల్లాలో చిత్రరంగం అభివృద్దికి కరీంనగర్ ఫిల్మ్ సోసైటీ సభ్యులు వారాల ఆనంద్ తో పాటు సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*