కొత్తపేటలో ఉన్న ఈ ఇల్లు అందరిదీ!!

నేను, నా కుటుంబం, కొంచెం పేరు ప్రతిష్ఠలు. ఈ లెక్కల్లో పడి మనిషిలో మానవత్వం మాయమైపోతున్నది. స్వార్ధమే తప్ప, పక్కోడి బాగోగులు పట్టని నేటి సమాజంలో- ముక్కూముఖం తెలియని వ్యక్తి భోజనం చేశారా అని ఆత్మీయంగా పలకరిస్తే ఎలా వుంటుంది? తెలియని ఆనందమేదో గుండెను ముంచెత్తుతుంది. మరి పలకరించినందుకే అంత సంతోషంగా ఉంటే- ఏకంగా ఇంట్లోకి వచ్చి తినిపోండని చెప్తే ఎలా వుంటుంది?

దిల్ సుఖ్ నగర్ నుంచి కొత్తపేటకు వెళ్తుంటే, రోడ్ నెంబర్ 2 ఎస్‌బీఐ కాలనీలో మీసేవకు ఎదురుగా ఉంటుంది ఓపెన్ హౌజ్. రెండు అంతస్తుల ఇండిపెండెంట్ హౌజ్. చెట్లమధ్య పొదరిల్లులా, ఆకుపచ్చ రంగు గోడలతో కనిపిస్తుంది. లోపలకి వెళ్లి చూస్తే మనుషులెవరూ కనిపించకపోవచ్చు. కానీ మనవత్వం అక్కడ బియ్యం బస్తా రూపంలో ఉంటుంది. ఆత్మీయత వంటగ్యాసై పకలరిస్తుంది. బరువు తీర్చుకోండని పుస్తకాలు చేతులు ఊపుతుంటాయి.

ఇంతకూ ఏంటీ ఓపెన్ హౌజ్ అనేగా మీ సందేహం. ఏమీలేదు. ఓపెన్ హౌజ్ అంటే ఈ ఇల్లు అందరిదీ అని అర్ధం. ఇక్కడికి ఎవరైనా రావొచ్చు. ఆకలేస్తే వండుకుని తినొచ్చు. నిద్రొస్తే అరుగుల మీద హాయిగా నడుం వాల్చేయొచ్చు. బోర్ కొడితే పుస్తకాలు తిరగేయొచ్చు. ఎవరూ ఏమీ అడగరు. ఎవరైనా వండుకుని తినొచ్చు అని బోర్డు మీద రాసి ఉంటుంది.

తాను తింటూ పక్కవాడికి పెట్టొచ్చు అనే ఆలోచన నుంచే వచ్చిన ప్రయత్నమే ఓపెన్ హౌజ్ కాన్సెప్ట్. ఎన్నో ప్రయోగాల తర్వాత 2006లో మొదలుపెట్టామని నిర్వాహకులు అంటున్నారు. మొదట్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు తలుపులు తీసి ఉంచేవారు. పారిశుధ్య కార్మికులు, నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు, నిరుద్యోగులు, తలదాచుకోడానికి నా అనేవాళ్లు లేనివారు, అనాథలు, అభాగ్యులు ఇలా ఈ ఇంటికి రానివారు లేరు. మొదట్లో నిర్వాహకులే వండిపెట్టేవాళ్లు. తర్వాత కుదరక, ఎవరి వంట వాళ్లే చేసుకోండని ఆఫర్ ఇచ్చారు.

ఎక్కువ శాతం నిరుద్యోగులు, ఇంటినుంచి పారిపోయి వచ్చినవాళ్లు ఇక్కడికి వస్తుంటారు. జనాల తాకిడి పెరడగంతో పొద్దున ఐదింటి నుంచి రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుతున్నారు. ప్రత్యేకంగా విద్యార్ధులకు అన్నం అందుబాటులో ఉండాలి అన్న
సదుద్దేశంతో బియ్యం నిండుకోనీయరు. ఇక్కడికి వెళ్తే అన్నం ఏ సమయంలో అయినా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాసింత పచ్చడి వేసుకుని తింటే, కాలే కడుపుకు అంతకు మించిన అమృతం వేరే ఏముంటుంది చెప్పండి. తినేవాళ్లు తింటారు. చదువుకునే వాళ్లు చదువుకుంటారు. పడుకునే వారు పడుకుంటారు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు.

బియ్యం, గ్యాస్, నూనె, పప్పు, కారం, ఇలా సామాగ్రికి లోటు లేదు. ఎంతమంది వచ్చినా లేదు కాదు అనరు. పై అంతస్తులో ఒక క్లినిక్ ఉంది. దాన్నుంచి వచ్చిన ఆదాయంతోనే వంటసామాను సమకూర్చుతారు. ఒక బియ్యం బస్తా అయిపోయిందంటే వందమంది వచ్చారని వాళ్ల లెక్క. బే షరతుగానే నడుస్తుంది. ఇప్పటిదాకా ఎవరినీ విరాళాల గురించి చేయి చాచలేదు. స్వయంగా వచ్చి ఇస్తే కాదనరు.

నువ్వు తినేదే పక్కవాడికి పెట్టు అనే కాన్సెప్ట్ తో నడుస్తున్న ఓపెన్ హౌజ్ నిజంగా అనాథలు, అభాగ్యుల పాలిట అమృతహస్తం! నేను, నా సంపాదన అని బతికే మనుషులున్న ఈ రోజుల్లో.. ఒక ఇంటినే సమాజం కోసం ధారాదత్తం చేయడమంటే సామాన్య విషయం కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*