లక్క బొమ్మలకు మళ్లీ మంచిరోజులు

మార్కెట్లో ఎన్ని ప్లాస్టిక్ బొమ్మలున్నా లక్క బొమ్మల అందమే వేరు. హస్తకళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకునే లక్క బొమ్మలకు వెల కట్టలేం. ఇళ్లల్లో అలంకరణ కోసం చాలా మంది లక్క బొమ్మలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో లక్క బొమ్మల వ్యాపారానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. లక్కబొమ్మలంటే ముందుగా గుర్తొచ్చేది సంగారెడ్డి జిల్లానే. మంగంపేట, బొంతపల్లి, గుమ్మడిదల గ్రామాల్లో చాలా యేళ్ల నుంచి హస్తకళాకారుల కుటుంబాలు నివాసముంటున్నాయి. తరతరాలుగా లక్క బొమ్మల తయారీనే వీరికి జీవనాధారం. ఏడాది పొడవునా బొమ్మలు తయారు చేస్తూనే ఉంటారు. మంగపేటలో 10 కుటుంబాలు, బొంతపల్లిలో 20 కుటుంబాలు, గుమ్మడిదలలో 15 కుటుంబాలు లక్కబొమ్మల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. లక్కతో బొమ్మలు తయారు చేసి, వాటికి సహజ సిద్ధమైన రంగులు వాడుతారు. అందుకే సంగారెడ్డి జిల్లా లక్కబొమ్మలు ప్రత్యేకంగా ఉంటాయి.

లక్కబొమ్మల తయారీకి పాలగొడిసె కర్రను వాడుతారు. మంబాపూర్‌, నల్లవల్లి అటవీ ప్రాంతాల నుంచి కర్రను సేకరిస్తారు. లక్క బొమ్మలకు లక్క రంగులనే అద్దుతారు. అందుకే వాటి వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు. విత్తనాలు, చెట్ల ఆకులు, కొన్ని ప్రత్యేకమైన చెట్ల రసాలతో రంగులను తయారు చేస్తారు. ఆట వస్తువుల దగ్గర్నుంచి ఇంట్లో అలంకరణకు వాడే బొమ్మల వరకు అద్భుతంగా తయారు చేస్తారు. పిల్లలు అడుకునే నాలుగు చక్రాల బండి, శుభకార్యాల్లో వాడే తొట్టెలు, డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువగా తయారు చేస్తుంటారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త రకమైన లక్క బొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంటారు. హైదరాబాద్‌లోని బేగంబజార్, సుల్తాన్ బజార్, చార్మినార్, లాడ్ బజార్, సిక్రిందాబాద్‌లో దొరికే లక్క బొమ్మలు ఇక్కడ తయారు చేసినవే.

సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాలకు చెందిన హస్త కళకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించింది. గోల్కొండ హార్టీ కల్చరల్‌ క్రాఫ్ట్స్‌ కేంద్రాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి, లక్క బొమ్మలకు మార్కెట్ కల్పించింది. హస్తకళాకారులను మరింత ప్రోత్సహించి వారికి మెరుగైన అవకాశాలు, ఆదాయం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ సహకారంతో కేంద్రం గుమ్మడిదలలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లక్కబొమ్మల తయారీలో నైపుణ్యం పెంపొందించేలా వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో హస్త కళాకారులను గుర్తించి, వారికి నాలుగు నెలల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక మైనార్టీ మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ మహిళలకు శిక్షణ అందిస్తున్నారు.

త్రిమూర్తులు, యాకుబ్‌ అలీ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల కేంద్రంలోని హస్తకళల శిక్షణ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త బొమ్మలు ఎలా తయారు చేయాలో నేర్పుతున్నారు. ప్లాస్టిక్ బొమ్మలకు దీటుగా ఆకర్షణీయమైన లక్క బొమ్మలను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తున్నారు. మరో రెండు నెలల పాటు ట్రెయినింగ్ కొనసాగుతుంది. శిక్షణలో భాగంగా తయారు చేసిన లక్క బొమ్మలను సంగారెడ్డిలోని గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియంలో విక్రయానికి ఉంచుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకు లోన్లు ఇప్పించి, స్వయంగా ఉపాధి పొందేలా అవకాశం కల్పిస్తున్నారు.

మొత్తంగా లక్క బొమ్మలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా బొమ్మలు అమ్ముకునే అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*