బురద ఎంత ఎక్కువుంటే కమలం అంత వికసిస్తుంది

ప్రధాని కుర్చీ కోసం ప్రతిపక్షం వెంపర్లాడుతోందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన కిసాన్ కల్యాణ్ ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు. అధికారం చేపట్టడమే లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షం- పేదలు, యువత, రైతుల్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
అవిశ్వాస తీర్మానం విషయంలో కాంగ్రెస్ వ్యవహార శైలిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా తప్పుబట్టారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే.. జవాబు చెప్పలేక కౌగిలింత ఇచ్చారని విమర్శించారు. అవిశ్వాసం సందర్భంగా లోక్సభలో కాంగ్రెస్ వ్యవహరించిన విధానమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
పేదలు, యువత, రైతులను పూర్తిగా మరిచిపోయిన ప్రతిపక్ష నేతలు ప్రధాని కుర్చీ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. దేశం కోసం పనిచేస్తూ, అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడటాన్ని ప్రతిపక్షాలు నేరంగా పరిగణిస్తున్నాయా అని మోడీ ప్రశ్నించారు. అవిశ్వాసం సందర్భంగా ప్రతిపక్షాలు ఏకమవడంపైనా ప్రధాని విమర్శలు గుప్పించారు.
బురద ఎంత ఎక్కువుంటే కమలం అంత వికసిస్తుందని సటైర్ వేశారు. మద్దతు ధర విషయంలో చెరుకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఆయన.. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రైతు సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
కిసాన్ కల్యాణ్ ర్యాలీలో మోడీ పరోక్షంగా విమర్శించడంపై ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోడీ తన కథ అల్లుకునేందుకు కొందరిలో గూడు కట్టుకున్న ద్వేషాన్ని, భయాన్ని, ఆగ్రహాన్ని ఉపయోగించుకున్నారు. అయితే జాతి నిర్మాణానికి భారతీయుల హృదయాల్లోని ప్రేమ, సహనమే మార్గమని నిరూపించబోతున్నామని ట్వీట్ చేశారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*