ఆ రెండు సినిమాల విషయంలో ఎక్కడో కొడుతోంది!

ప్రముఖ పంపిణీదారుడు అభిషేక్ నామా ఎన్నో విజయవంతమైన చిత్రాలు పంపిణీ చేశారు. ఒకానొక సమయంలో ‘దిల్’ రాజుతోనూ పోటీ పడ్డారు. అయితే… ఆయన నిర్మాతగా మారి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘సాక్ష్యం’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కాబోతోంది. కానీ ఆఖరి నిమిషంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు ఇచ్చేశారు.

అలానే అదే సంస్థ నుండీ ఆగస్ట్ 3న ‘గూఢచారి’ అనే సినిమా విడుదల కాబోతోంది. విచిత్రం ఏమంటే… ఈ సినిమా పంపిణీ హక్కుల్ని ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ వారికి ఇచ్చేశారు అభిషేక్ నామా. పంపిణీదారుడిగా మంచి అనుభవం ఉన్న ఈయన ఇలా తన రెండు సినిమాలను సరిగ్గా విడుదలకు ముందు వేరొకరి చేతుల్లో పెట్టడం పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి పంపిణీరంగంలోనూ అనుభవం ఉన్న నిర్మాతలు తమ చిత్రాలను తామే విడుదల చేసుకుని భారీ లాభాలు పొందుతారు…. లేదంటే కొన్ని ఏరియాలు మాత్రం అమ్మేసి… సేఫ్ గేమ్ ప్లే చేస్తారు. కానీ అభిషేక్ నామా రెండు సినిమాల పంపిణీ హక్కుల్నీ ఇచ్చేయడం చూస్తుంటే రిజల్ట్ పై ఆయనకు సందేహం ఉన్నట్టేగా అని సినీజనం దీర్ఘాలు తీస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*