డిజిటల్ యుగంలోనూ టెలివిజన్ సెట్లకు తగ్గని గిరాకీ

టెలివిజన్. ఒకప్పుడు అందుబాటులో ఉన్న దృశ్య ప్రసార మాధ్యమం. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫోన్లలోనూ వీడియో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ లో కావాల్సిన ప్రోగ్రాంను కోరుకున్న సమయంలో చూసే అవకాశం ఉన్నా ఇప్పటికీ చాలా మంది టీవీల ముందు కూర్చొని చూసేందుకే ఇష్టపడుతున్నారు. డిజిటల్ యుగంలోనూ టెలివిజన్ సెట్లకు ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు.

ఒకప్పుడు సినిమాలు, సీరియళ్లు చూడాలంటే టీవీ ముందు కూర్చోవాల్సిందే. కానీ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెల్ ఫోన్ల రాకతో కోరుకున్న ప్రోగ్రాంలను తమకు వీలైన సమయంలో చూసే వీలు కలుగుతోంది. ప్రస్తుతం దేశంలో 30 కోట్లు మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అనేక ఫ్లాట్ ఫామ్ ల ద్వారా వీడియో స్ట్రీమింగ్ కు అవకాశమున్నా టీవీకున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ చాలా మంది టీవీ ముందు కూర్చుని నచ్చిని ప్రోగ్రాంలు చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఇదే భవిష్యత్తులో టీవీ మార్కెట్కు ఆదరణ ఏ మాత్రం తగ్గదనడానికి నిదర్శనం.

 

బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్.. బార్క్ నిర్వహించిన సర్వే ప్రకారం 2016 లో దేశంలో 18 కోట్ల 30 లక్షల ఇళ్లలో టీవీ సెట్ లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 19 కోట్ల 70 లక్షలకు చేరింది. అంటే రెండేళ్లలో టీవీలు కలిగిన ఇళ్ల సంఖ్య 7.6శాతం పెరిగింది. బ్రాడ్ కాస్ట్ ఇండియా సర్వే 2018 ప్రకారం దేశంలో 66 శాతం మంది టీవీ వీక్షిస్తున్నారు. అంటే ప్రస్తుతం దేశంలో 83 కోట్ల 50 లక్షల మందికి టీవీలు అందుబాటులోఉన్నాయి. ఈ సంఖ్య యూరప్ జనాభా కన్నా ఎక్కువ కావడం విశేషం.

 

టెలివిజన్ ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ అతిపెద్ద ప్రసార మాధ్యమంగా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది నిపుణుల మాట. గత ఐదేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2013 లో భారత్లో కేవలం 15 కోట్ల 40 లక్షల ఇళ్లలో టీవీ అందుబాటులో ఉండగా.. 2016 నాటికి 18 కోట్ల 30 లక్షలు, ప్రస్తుతం 19కోట్ల 70 లక్షల కుటుంబాలకు టెలివిజన్ సెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక టీవీని వీక్షించే వారి సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైంది. 2013లో వీక్షకుల సంఖ్య 67కోట్ల 50 లక్షలు కాగా.. 2016లో 78 కోట్లు, ప్రస్తుతం 83కోట్ల 50 లక్షలకు చేరింది. ఇక మారుమూల ప్రాంతాలకు సైతం టీవీ మార్కెట్ విస్తరిస్తోంది. ఫలితంగా 2013లో దేశంలోని 54 శాతం ప్రాంతాలకు అందుబాటులో ఉన్న టీవీ సెట్లు ప్రస్తుతం 66 శాతానికి చేరింది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే.. తమిళనాడులో 97 శాతం, కర్నాటకలో 96, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 94, కేరళలో 93 శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కేబుల్ లేదా డిష్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఫ్రీ టూ ఎయిర్ చానెళ్లు వీక్షించే వెసలుబాటు ఉండటంతో చాలా మంది టీవీల్లోనే ప్రోగ్రాంలు చూసేందుకు ఇష్టపడుతున్నారు.

 

దక్షిణాది రాష్ట్రాల్లో 90 శాతం ఇళ్లలో టీవీలు ఉన్నా.. యూపీ, బీహార్, రాజస్థాన్తో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా టీవీ ముఖం చూడని కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఆ కారణంగానే టీవీలు కలిగిన కుటుంబాల జాతీయ సగటు 66శాతానికే పరిమితమైంది. అంటే టీవీల మార్కెట్ విస్తరణకు ఇంకా 34 శాతం అవకాశం ఉంది. మే 1న ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినట్లుగా దేశంలో వందశాతం గ్రామాలకు కరెంటు సరఫరా జరిగితే టీవీలు, రిఫ్రిజిరేటర్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బార్క్ తాజా సర్వే ప్రకారం దేశంలో మధ్య తరగతి జనాభా పెరుగుతోంది. న్యూ కన్జ్యూమర్ క్లాసిఫికేషన్ సిస్టంలో డీ, ఈ గ్రేడ్లో ఉన్న కుటుంబాల సంఖ్య 14శాతం మేర తగ్గిపోవడంతో ఆ మేరకు టీవీల కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తోంది.

వివిధ వర్గాల ప్రజలకు చేరవయ్యేందుకు ప్రధాన ప్రసార సాధనం టెలివిజన్. అందుకే డిజిటల్ రంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా బడా బడా కంపెనీలు సైతం ఇప్పటికే తమ ఉత్పత్తుల అడ్వర్టైజింగ్ కోసం టీవీలనే నమ్ముకుంటున్నాయి. వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు చేసే మొత్తంలో 45 శాతం టీవీ యాడ్లకు కేటాయిస్తున్నాయి. ఈ ఏడాది టీవీ యాడ్ రెవెన్యూ 13 శాతం పెరుగుతుందని వివిధ సంస్థల అంచనా.. భవిష్యత్తులో టీవీలకు ఆదరణ ఏ మాత్రం తగ్గదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*