చంద్రుడి మీద కూడా చెత్త పేరుకుంటోంది!!

మనిషి ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ మార్పు తథ్యం. చంద్రుడిపై అడుగుపెట్టాక అక్కడ అదే జరిగింది. చందమామ మిస్టరీని చేధించే క్రమంలో మనిషి దాన్ని చెత్త కుప్పగా మార్చేశాడు. ఆరు దశాబ్దాలుగా పరిశోధనల పేరుతో వివిధ దేశాలు చేస్తున్న ప్రయోగాలతో జాబిల్లిపై చెత్త పేరుకుపోతోంది.

1969 జులై 20. మనిషి తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన రోజు. అపోలో ప్రాజెక్ట్లో భాగంగా జాబిల్లిపైకి చేరుకున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్లలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలిసారి చంద్రుడిపై కాలు మోపి రికార్డులకు ఎక్కాడు. దాదాపు 21 గంటల పాటు చంద్రమండలంపై గడిపిన ఆస్ట్రోనాట్లు తిరిగి జులై 24న భూమిపై అడుగుపెట్టారు. మానవాళి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఈ ఘట్టానికి 60ఏళ్లు పూర్తయ్యాయి. అయితే మనిషి ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ మార్పు తధ్యం. చంద్రుడు అందుకు అతీతుడు కాదనడానికి అక్కడ పేరుకుపోయిన చెత్తే నిదర్శనం.

అరవై ఏళ్ల క్రితం చంద్రుడు ఒక మిస్టరీ. అక్కడంతా శూన్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మిస్టరీ కొంత వరకు వీడింది. శూన్యాన్ని చెత్త భర్తీ చేసింది. చంద్రమండలంపై పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశోధించే నాసా.. జాబిల్లిపై చాలా చెత్త పేరుకుపోయిందనే విషయాన్ని గుర్తించింది. అయితే ఇవన్నీ అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా అక్కడికి వెళ్లినప్పుడు వ్యోమగాములు వదిలిపెట్టి వచ్చినవేనని తేల్చింది. అక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు భూమ్మీద నుంచి పంపిన వస్తువులు కూడా అందులో ఉన్నాయి.

1969లో అపోలో ప్రోగ్రామ్లో భాగంగా తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యోమగాములు అక్కడి నుంచి కొన్ని శిలల్ని, మట్టిని పరిశోధనల కోసం సేకరించారు. అయితే తిరిగి వచ్చే క్రమంలో వ్యోమనౌకలో ఆ మేరకు బరువు, ఇంధన ఖర్చును తగ్గించుకునేందుకు కొన్ని వస్తువుల్ని అక్కడే వదిలిపెట్టి వచ్చారు. అలా మనిషి తన తొలి ప్రయాణంలోనే చంద్రునిపై దాదాపు 106 వస్తువుల్ని వదిలిపెట్టి వచ్చాడు. వాటిలో కొన్ని ప్రయోగాలకు అవసరమైనవి కాగా.. మరికొన్ని ఎందుకూ పనికిరాని చెత్తా చెదారం.

అపోలో ప్రోగ్రామ్ లో భాగంగా ఆస్ట్రోనాట్లు జెండా, ల్యూనర్ ఆర్బిటర్స్, ఆస్ట్రోనాట్ పిన్స్, సుత్తి, పక్షి ఈకలు, గోల్డెన్ ఆలివ్ చెట్టు కొమ్మతో పాటు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్డ్రిన్ల బూట్లు జాబిల్లిపై వదలివచ్చారు. అయితే ఈ వస్తువులన్నీ అక్కడి వాతావరణాన్ని అంచనా వేసేందుకేనని వారు చెప్పారు. చంద్రుని ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తిని పరీక్షించేందుకే ఇలా చేశామని చెప్పారు. నాసా తర్వాత అనేక దేశాలు చంద్రమండలం యాత్రకు శ్రీకారం చుట్టాయి. అమెరికాతో పాటు జపాన్, రష్యా, ఇండియా, యూరప్ తదితర దేశాలు చంద్రునిపై జెండా ఎగరేశాయి. అలా విభిన్న దేశాల ప్రయోగాల వల్ల జాబిల్లిపై మరిన్ని వ్యర్థాలు జమ అయ్యాయి. చంద్రునిపై పేరుకుపోయిన చెత్తలో చిన్న చిన్న వస్తువులతో పాటు టన్నుల బరువైన మెటల్, కార్బన్ ఫైబర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చంద్రుడు, ఇతర గ్రహాలపై పరిశోధనలు, ఇతర అవసరాల కోసం పంపిన శాటిలైట్ల విడి భాగాలే కావడం విశేషం.

చంద్రమండలంలో వదిలి వచ్చిన వస్తువులు, మెషీన్లలో కొన్ని ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయట. వాటిలో ముఖ్యమైనది లేజర్ రేంజ్ రిఫ్లెక్టర్ ఒకటి. దీన్ని భూమ్మీద ఉన్న అంతరిక్ష పరిశోధకులు కూడా పింగ్ చేయగలరు. భూమి చంద్రుల మధ్య దూరాన్ని కొలిచేందుకు ఉపయోగించే ఈ రిఫ్లెక్టర్ ద్వారా భూమి నుంచి చంద్రుడు సంవత్సరానికి ఒకటిన్నర అంగుళాల దూరం కదులుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇన్నేళ్లుగా అక్కడున్న వస్తువుల్ని పరీక్షించడం ద్వారా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, కాలాంతరంలో జరిగిన మార్పును అధ్యయనం చేస్తున్నారు.

చంద్రమండలంపై పేరుకుపోయిన చెత్త ఎంతంటే చెప్పడం కష్టమే. ఆ చెత్త బరువు దాదాపు నాలుగు లక్షల పౌండ్లు ఉండొచ్చని అంచనా. అంటే ఇది భూమ్మీద లక్షా 81వేల కిలోల బరువుతో సమానం. అయితే ఇది మరింత ఎక్కువగానే ఉండొచ్చన్నది నాసా సైంటిస్టుల అభిప్రాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*