ఆ మూడో బ్లూటిక్ లేనట్టే.. స్పష్టం చేసిన వాట్సాప్

మూడో బ్లూటిక్‌పై వస్తున్న వార్తలను వాట్సాప్ కొట్టి పడేసింది. వాట్సాప్‌లో సాధారణంగా రెండు బ్లూటిక్‌లు మాత్రమే కనిపిస్తాయి. అయితే, ఇకపై మూడో బ్లూటిక్‌ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన వాట్సాప్ అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. మూడో బ్లూటిక్‌ను తీసుకొచ్చే ఉద్దేశం లేదని, దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పింది.

వాట్సాప్‌లో ఇటీవల ఫేక్ న్యూస్ విస్తృత ప్రచారం పొందుతోంది. తప్పుడు వార్తలకు విపరీత ప్రచారం లభిస్తుండడంతో దేశంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనుమానితులపై మూకుమ్మడి దాడులు పెరిగిపోతున్నాయి. దీంతో, ఇటువంటి వార్తలు ప్రబలకుండా అడ్డుకట్ట వేయాలంటూ ప్రభుత్వం వాట్సాప్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తమైన వాట్సాప్ త్వరలోనే మరో ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కనిపించే రెండు బ్లూటిక్‌ల స్థానంలో ఇకపై మూడోది తీసుకురానుందని వార్తలు వినిపించాయి. యూజర్లు పంపించిన మెసేజ్‌లపై నిఘా వేయనున్న ప్రభుత్వం వాటిని చదువుతుందని‌, ప్రభుత్వ ప్రతినిధి వాటిని చదవగానే మూడో బ్లూటిక్ కనిపిస్తుందన్న వార్త హల్‌చల్ చేసింది. యూజర్ పంపిన వార్త రెచ్చగొట్టేదిగా ఉంటే అది వైరల్ కాకుండా అడ్డుకట్ట వేసి అతడిపై చర్యలు తీసుకుంటుందని వార్తలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన వాట్సాప్ అదంతా ఉత్తదేనని, అటువంటి ఫీచర్ తెచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*