త్రీడీ టెక్నాలజీతో మానవ శరీర భాగాలు

త్రీడీ టెక్నాలజీ అంటే కేవలం సినిమాల్లో కనిపించేది మాత్రమే కాదు. సృష్టికి ప్రతి సృష్టి చేసే సత్తా కూడా త్రీడీ టెక్నాలజీకి ఉంది. ఆటోమొబైల్, ఏరో స్పేస్, ఆర్ట్ లాంటి అనేక రంగాల్లో ఇప్పుడు త్రీడీ టెక్నాలజీ వినియోగం పెరిగింది. ముఖ్యంగా వైద్య రంగంలో త్రీడీ టెక్నాలజీ వండర్స్ క్రియేట్ చేస్తోంది. మానవ శరీర భాగాలను త్రీడీ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో పుర్రె లేదా ఇతర అవయవాలు దెబ్బతిన్నప్పుడు వాటి స్థానంలో కృత్రిమ అవయవాల్ని అమర్చడం సవాలుతో కూడుకున్న పని. మట్టి, చెక్క, స్టీల్, థర్మాకోల్‌ లాంటి వస్తువులతో కృత్రిమ అవయవాలను తయారు చేసే వారు. నిజానికి ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ప్రమాదంలో దెబ్బతిన్న అవయవాన్ని స్కానింగ్ తీసి, కొలతలు తీసుకొని, వాటిని విదేశాలకు పంపేవారు. అక్కడి కృత్రిమ అవయవం తయారై ఇండియా రావడానికి రెండు నెలలు పట్టేది. అంత రిస్క్ తీసుకున్నా ప్రోడక్ట్లో ఏదో ఒక లోపం ఉండేది. అది పేషెంట్కు పర్ ఫెక్టుగా సూటయ్యేది కాదు. దీనివల్ల అటు టైం, ఇటు ట్రీట్ మెంట్ రెండూ వృథా. అయితే, త్రీడీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. వంద శాతం కచ్చితత్వంతో కృత్రిమ అవయవాలను తయారు చేస్తోంది త్రీడీ టెక్నాలజీ.

ప్రస్తుతం అన్ని ప్రయోగాలకు త్రీడీ టెక్నాలజీ కీలకంగా మారింది. ఆటోమొబైల్, ఏరో స్పేస్, బయో మెడికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌తోపాటు ఆభరణల తయారీకి కూడా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీనే వాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒక అడుగు ముందుకేసి త్రీడీ టెక్నాలజీతో కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు. ఆ మధ్య ఒక ఆస్పత్రిలో కేన్సర్ పేషంట్ దవడను తొలగించాల్సి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్లు త్రీడీ టెక్నాలజీతో కృత్రిమ దవడను తయారు చేసి ఇచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి పుర్రె దెబ్బతింటే, అతడి కోసం కృత్రిమ స్కల్ తయారు చేశారు. ఎంఆర్ఐ రిపోర్ట్ ఆధారంగా పొల్లుపోకుండా పుర్రెను తయారు చేసి ఇచ్చారు. ఎంతో మంది కృత్రిమ అవయవాల కోసం ఓయూ ప్రొఫెసర్ల దగ్గరికి వస్తున్నారు. త్రీడీ టెక్నాలజీని వైద్య రంగంలో ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఓయూ ప్రొఫెసర్లు పరిశోధనలు చేస్తున్నారు. అందులో పది పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి.

త్రీడీ యంత్రాన్ని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. దీనికి కోటి రూపాయలు ఖర్చయింది. ఎలాంటి వస్తవుయినా సరే వంద శాతం కచ్చితత్వంతో తయారు చేస్తుంది. ఇందులో ఉండే లేజర్ యూనిటే అత్యంత కీలకం. కృత్రిమ అవయవాలను తయారు చేయడానికి ఉపయోగించే పౌడర్ ఇక్కడ దొరకదు. దాన్ని కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కిలో పౌడర్ రేటు ఏడు నుంచి ఎనిమిది వేలు ఉంటుంది. త్రీడీ ప్రింటింగ్ యంత్రం పనితీరును ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ టీ-న్యూస్కు వివరించారు.

ముందు ముందు త్రీడీ టెక్నాలజీ ద్వారా వైద్య రంగంలో మరిన్ని అద్భుతాలు చేయవచ్చంటున్నారు డాక్టర్లు. గతంలో కృత్రిమ అవయవాల తయారీకి చాలా టైం పట్టేదని, కానీ ఓయూ ప్రొఫెసర్ల కృషితో తక్కువ సమయంలోనే తయారు చేస్తున్నామని చెప్తున్నారు. త్రీడీ టెక్నాలజీ ద్వారా ఖర్చు కూడా తక్కువే అంటున్నారు వైద్యులు.

ప్రస్తుతం ఎముకలు, స్కల్ లాంటి శరీర భాగాలను త్రీడీ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో లివర్, హార్ట్, కిడ్నీ లాంటి కీలక అవయవాలను కూడా త్రీడీలో తయారు చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*