పాతబస్తీ ముర్గీ చౌక్ లో ఫేమస్ ఏంటో తెలుసా..?

నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర భాగ్యనగరానిది. అద్భుతమైన, అరుదైన చారిత్రక సంపద మన నగరం సొంతం. అందులోనూ పాతబస్తీ అంటే ఇంకా ప్రత్యేకం. ఇక్కడి అణువణువూ ముత్యాల నగరం చారిత్రక వైభవాన్ని ఎలుగెత్తి చాటుతుంది. చార్మినార్ దగ్గరున్న ముర్గీ చౌక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరుదైన చారిత్రక సంపదకు ఈ ప్రాంతం నెలవు. ఇక్కడ రకరకాల పక్షులు, కుందేళ్లు అమ్మే షాపుల మధ్యలో గత వైభవానికి ప్రతీకగా కనిపిస్తుంది ముర్గీ చౌక్. పది పదిహేను దుకాణాలు ఉంటాయి.

 

అన్నింట్లోనూ పాత వస్తువులే. నిజాం కాలం నాటి చారిత్రక సంపదతోపాటు కనుమరుగైపోతున్న ప్రాచీన సంపద అంతా ఇక్కడ దొరుకుతుంది. ఈ తరానికి తెలియని అనేక పురాతన వస్తువుల ఆచూకీ ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఫ్రెంచ్, బ్రిటిష్, నిజాం కాలం నాటి ప్రాచీన వస్తువులను ముర్గీ చౌక్ తన బహువుల్లో పదిలంగా దాచుకున్నట్టు అనిపిస్తుంది. ఒక షాపులో కంచు విగ్రహాలు. మరో చోట ఇత్తడి చెంబులు, గిన్నెలు. ఇంకో దగ్గర షాండిలియర్లు, లాంతర్లు. మరో చోట పాత కెమెరాలు, ఇనుప సందూక్లు. అన్నీ పాతవే. అయితేనేం ఏమాత్రం వన్నె తరగలేదు. చూడగానే మళ్లీ ఆ పాత రోజులు మనోఫలకం మీద మెరుస్తాయి.

రేడియోలు, ప్రొజెక్టర్లు, చేతికర్రలు, గ్రామ్ ఫోన్లు, గడియారాలు, హుక్కాలు, ఆట వస్తువులు, పురాతన గ్రంథాలు, బరువు కొలిచే బాట్లు, అరుదైన చేతి పంపులు, టైపింగ్ మెషిన్లు, కుట్టు మిషన్లు.. ఇలా అలనాటి అపురూపమైన వస్తువులన్నీ ముర్గీ చౌక్లో దొరుకుతాయి. ఓల్డ్ సిటీలో గత 60 ఏళ్లుగా పాత వస్తువుల వ్యాపారం కొనసాగుతోంది. హైదరాబాద్కు వచ్చే టూరిస్టులు ముచ్చటపడి పాత వస్తువులను కొనుక్కెళ్తుంటారు.

ముర్గీ చౌక్లో పాత తాళాలకు డిమాండ్ ఎక్కువ. పురాతన తాళాలను సేకరించి, వాటిని బాగు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అప్పట్లో వేలం వేసిన అరుదైన వస్తువులన్నీ ఇక్కడికి వచ్చి చేరాయి. ఇప్పుడు వాటి విలువ లక్షల్లో ఉంటుంది. చాలా మంది తమ ఇళ్లల్లో ఉన్న పాత వస్తువులను ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. వాటిని రిపేర్ చేసి మళ్లీ విక్రయానికి పెడతారు. కొన్ని రకాల వస్తువులను మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎంత పాత వస్తువు అయితే ధర అంత ఎక్కువగా ఉంటుంది. దేశం నలుమూల నుంచి కస్టమర్లు ఇక్కడికి వస్తుంటారు. అయితే, జీఎస్టీ వచ్చిన తర్వాత బిజినెస్ కొంచెం డల్ అయిందని వ్యాపారులు అంటున్నారు.

 

హైదరాబాద్ లో ఉంటున్నా చాలా మందికి ముర్గీ చౌక్ గురించి తెలియదు. వీలుంటే వీకెండ్లో ఒకసారి వెళ్లి చూడండి. చౌక్ లోకి అడుగుపెట్టగానే ఫోర్ జీ జమానా మనోఫలకం మీది నుంచి చెరిగిపోయి, ఆ పాత మధురాలన్నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*