బాబా రామ్ దేవ్ యోగా నేర్చుకున్నది మన కామారెడ్డిలోనే

కామారెడ్డి జిల్లాలోని అర్ష గురుకుల విద్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందరో విశిష్టమైన వ్యక్తులు ఇక్కడ విద్య నేర్చుకున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ మూడు దశాబ్దాల కిందట అర్ష గురుకులంలోనే యోగ శాస్ర్తాన్ని అభ్యసించారు. అంతేకాదు స్వామి పరిపూర్ణానంద కూడా ఇక్కడ తొమ్మిది నెలల పాటు సంస్కృతం, వేద సిద్ధాంతాన్ని అభ్యసించారు. ఇక్కడే వేదాలను ఔపోసన పట్టిన ఆచార్య బ్రహ్మదత్తు.. కోల్ కతా వెళ్లి ఐదు గురుకులాలు స్థాపించారు. ఆర్ష గురుకులంలో చదువుకున్న కొందరు విద్యార్థులు అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వివిధ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సంస్కృత పండితుల్లో చాలా మంది ఇక్కడి విద్యార్థులే కావడం విశేషం.

అర్ష గురుకుల మహా విద్యాలయం ఏర్పాటు వెనక ఎన్నో ఏళ్ళ శ్రమ, ఉత్తమ ఆశయాలు ఉన్నాయి. బ్రహ్మానంద సరస్వతి ఆలోచనా ఫలితమే ఈ మహా విద్యాలయం! ప్రాచీన భౌతిక విజ్ఞానాన్ని నేటి తరాలకూ అందిస్తున్న ఆధునిక దేవాలయం ఇది. సంస్కృతాన్ని బోధించడమే కాదు వైదిక ధర్మ పరిరక్షణకు సైతం ఈ విద్యాలయం కృషి చేస్తోంది. పేరుకు బ్రాహ్మణ విద్యాలయమే అయినప్పటికీ ఇక్కడ కులమతాలకు తావుండదు. ఎవరైనా ఇందులో వేదవేదాంగాలను అభ్యసించవచ్చు. ఎంతోమంది మహానుభావులను తయారు చేసిన ఈ విద్యాలయం ఒక విజ్ఞాన భాండాగారం. బ్రహ్మానంద సరస్వతి కృషి, పట్టుదల ఫలితంగా గత నాలుగు దశాబ్దాల నుంచి మన సంస్కృతి, సంప్రదాయాలను ఈ విద్యా సంస్థ కాపాడుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా వారిలో దేశభక్తిని నింపి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది.

1978 జూలై 16న కామారెడ్డిలోని వడ్లూర్‌లో అర్ష గురుకులాన్ని స్థాపించారు. బ్రహ్మానంద సరస్వతి గురువు సత్యపతి ఈ విద్యాలయాన్ని ప్రారంభించారు. చాలా ఏళ్ల వరకు వడ్లూర్‌లోనే విద్యాబోధన కొనసాగింది. రెండేళ్ల కిందటే విద్యాలయాన్ని పాత రాజంపేట్ లోని కొత్త భవనంలోకి మార్చారు. ఇందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉంది. కేవలం ఆధ్యాత్మిక చింతన, యోగాసనాలు, ఏడు విద్యలు, సంస్కృతం, వేదం, యజ్ఞ హోమాలే కాకుండా విద్యార్థులకు ఇంగ్లిష్‌ కూడా బోధిస్తారు. రెండేళ్ల కిందటే పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియంను ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా ఎందరో పేద పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, కర్నాటక తదితర ప్రాంతాల విద్యార్థులు కూడా ఈ వేద పాఠశాలలో ఉన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించటం ఇక్కడ మరో ప్రత్యేకత. 36 ఎకరాల్లో ఉన్న విద్యాలయంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు. ఇందులో ఒక గోశాల కూడా ఉంది. గోవులను పెంచుతూ వాటి ద్వారా వచ్చే పాలను, ఇతర పాల ఉత్పత్తులను విద్యార్థులకు అందిస్తారు.

అర్ష విద్యాలయంలోని గ్రంథాలయంలో ప్రాచీనమైన గ్రంథాలను కూడా అందుబాటులో ఉంచారు. యోగా, సంస్కృతం, ఆయుర్వేదం, జ్యోతిష్యం, వేద పాఠాలు, ఉపనిషత్తులన్నీ లైబ్రరీలో ఉన్నాయి. వీటితోపాటు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలు కూడా దొరుకుతాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వారితో జరిగిన ఒడంబడికలకు సంబంధించి బ్రహ్మానంద సరస్వతి ఎనిమిది గ్రంథాలను తయారు చేశారు. వాటిపై విద్యార్థులకు ప్రతిరోజు అవగాహన కల్పిస్తూ దేశభక్తిని పెంపొందిస్తున్నారు. ఇలా కామారెడ్డిలోని అర్ష గురుకులం ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*