ఢిల్లీలో ఘోరమైన ఆకలి చావు

దేశరాజధాని ఢిల్లీ ఆర్ధికంగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పేదరికం, ఆకలి చావులు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ముగ్గురు పసివాళ్లు ఏకంగా 8 రోజులు ఆకలితో అలమటించి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఒకావిడ ముగ్గురు పిల్లలను తీసుకుని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి వచ్చింది. చూస్తే ఆ ముగ్గురూ తలలు వాలేసి ఉన్నారు. ఏం జరిగిందని వైద్యులు ఆరా తీశారు. ఆమె సమాధానం చెప్పలేదు. నాడీ పరిశీలిస్తే చిన్నారులు చనిపోయారని డాక్టర్లకు అర్ధమైంది.

విషయం తెలియాలని పోస్టుమార్టం నిర్వహించారు. ఎండిపోయిన పిల్లల డొక్కల్లో మాడిపోయిన పేగుల్ని చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు. ఇన్నేళ్ల తమ సర్వీసులో ఇలాంటి చావు చూడలేదని కంటనీరు తీసుకున్నారు. ఏం జరిగిందని ఎంత ప్రశ్నించినా ఆ తల్లి నుంచి సమాధానం రాలేదు. ఒక్కమాట మాత్రం చెప్పింది. అన్నం పెట్టమన్నారు అని. అప్పుడు అర్ధమైంది డాక్టర్లకు.. పిల్లలు ఆకలితో అలమటించి చనిపోయారని.

8 రోజులుగా వాళ్లకు తిండిపెట్టని తల్లిని చూసి షాక్ అయ్యారు. కారణం ఆమెకు మతిస్థిమితం లేదు. పాపం, పిల్లల ఆకలి గుర్తించలేకపోయింది. తండ్రేమో ఉపాధి వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లాడు. వారం రోజులుగా ఎండిన డొక్కలతో ఏడ్చీఏడ్చీ ప్రాణాలు వదిలేశారు. మృతుల ఇంటికి వెళ్లి పరిశీలితే ఏవో మాత్రలు కనిపించాయి. అక్కడక్కడా వాంతులు, డయేరియా గుర్తించారు.

గుండె చెరువయ్యే ఈ సంఘటన క్రమంగా రాజకీయరంగు పులుముకుంది. పిల్లల ఆకలి చావుకు కేజ్రీవాల్ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని బీజేపీ, కాంగ్రెస్ విమర్శించాయి. రాజధానిలో ఇలాంటి ఘోరమైన చావు దేశానికే తలవొంపులు అని ఆప్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*