ఫ్యూచర్ మొత్తం రోబోలతోనే సర్జరీ

శంకర్ రోబో సినిమా గుర్తుందా? అందులో చిట్టి రోబో ఒకావిడకు పురుడు పోస్తుంది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని తెలుసుకుని అంత్యంత తెలివిగా పాపను ఈ భూమ్మీదికి తీసుకొస్తుంది. అయితే సినిమాలోనే కాదు బయట కూడా రోబోలు ఆపరేషన్లు చేస్తున్నాయి. కంటి ఆపరేషన్ దగ్గర్నుంచి గుండె బైపాస్ సర్జరీ దాకా రోబోటిక్ సర్జరీ కామన్ అయింది.

కాలం మారుతోంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషికి ప్రత్యామ్నాయంగా రోబోలు ఎప్పుడో రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడవే రోబోలు వైద్య రంగంలోకీ అడుగు పెట్టాయి. అడుగు పెట్టడమే కాదు- ఏకంగా ఆపరేషన్లు చేస్తున్నాయి. వాటిని సర్జికల్ రోబోట్లు అంటారు. డాక్టర్ల్య పర్యవేక్షణలో రోబోలు ఆపరేషన్ చేస్తాయి. ఈ పద్ధతిలో ఆపరేషన్ థియేటర్లో ఇద్దరు ముగ్గురు వైద్యులు ఉండాల్సిన పన్లేదు. సుశిక్షితులైన ఒకే ఒక డాక్టర్ సర్జికల్ రోబోట్ ద్వారా ఆపరేషన్ నిర్వహిస్తాడు. దాదాపు హైదరాబాద్‌లోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సర్జికల్ రోబోట్లు అందుబాటులోకి వచ్చాయి.

రొబోటిక్ సర్జరీ విధానంలో నాలుగు భాగాలుంటాయి. మాస్టర్ కంట్రోల్, రోబోట్, విజువలైజేషన్ ఎల్ఈడీ ఎక్విప్మెంట్, పేషెంట్ టేబుల్. సర్జన్ మాస్టర్ కంట్రోల్ దగ్గర కూర్చొని తన చేతివేళ్ల ద్వారా రోబోను కంట్రోల్ చేస్తాడు. రోబోట్‌కు ఐదు మిల్లీమీటర్లు, ఎనిమిది మిల్లీమీటర్ల పొడవైన సర్జికల్ పరికరాలు అమర్చుతారు. అంటే- సిజర్, కుట్లేసే సూదులు, కాట్రీ మిషన్ లాంటివి. వీటన్నింటినీ సర్జనే కంట్రోల్ చేస్తారు. కెమెరా, టూడీ విజన్, త్రీడీ విజన్ అన్నీ డాక్టరే నియంత్రిస్తుంటాడు. ఆపరేషన్ ప్రొసీజర్‌ను మిగతా స్టాఫ్ ఎల్ఈడీ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. అన్నవాహిక క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్‌తోపాటు హెడ్ అండ్ నెక్ సర్జరీలాంటివన్నీ సర్జికల్ రోబోట్లతో చేయొచ్చని వైద్యులు చెప్తున్నారు.

రొబోటిక్ సర్జరీ ల్యాప్రోస్కోపీ కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. శరీరం మీద చిన్నగాటుతోనే సర్జరీ చేస్తారు. పోస్ట్ ఆపరేషన్ పీరియడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ అయిన వెంటనే పేషెంట్ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇప్పుడు మనదేశంలో అనేక రకాల శస్త్ర చికిత్సలను సర్జికల్ రోబోట్ల ద్వారానే చేస్తున్నారు. రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌లో కెమెరా, మెకానికల్ ఆర్మ్ అనే రెండు పొడవాటి చేతులు ఉంటాయి. వీటికి సర్జికల్ పరికరాలు అమర్చి ఉంటాయి. డాక్టర్ కంప్యూటర్ కన్సోల్ ముందు కూర్చుని తన చేతులతో మిషన్‌ను కంట్రోల్ చేస్తుంటాడు. పేషెంట్ శరీరంలో శస్త్రచికిత్స జరుగుతున్న భాగాన్ని కన్సోల్కు ఉన్న 3డీ వ్యూ పాయింట్ నుంచి పరిశీలిస్తుంటాడు.

రొబోటిక్ ఆపరేషన్ లో టెలీమ్యాన్యుపులేటర్ చాలా కీలకం. ఇదొక రిమోట్ వ్యవస్థ. ఇది రోబో చేతులను కంట్రోల్ చేస్తూనే ఆపరేషన్ పరికరాలను అటూ ఇటూ కదిలిస్తుంటుంది. ఈ వ్యవస్థనంతా డాక్టరే నియంత్రిస్తుంటాడు. రొబోటిక్ సర్జరీలో కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఇంకా ప్రత్యేకమైనది. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో ఉండాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. ముఖ్యంగా కార్డియో, థొరాసిక్ కు సంబంధించిన ఓపెన్ సర్జరీలకు రొబోటిక్ సిస్టమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.

స్త్రీలకు సంబంధించిన కొన్ని రకాల ఆపరేషన్లను కూడా సర్జికల్ రోబోట్ల ద్వారానే చేస్తున్నారు. ఉదాహరణకు గర్భసంచి తొలగించాలంటే పొట్టను పది నుంచి 12 ఇంచుల వరకు కట్ చేయాలి. చర్మాన్ని నాలుగైదు లేయర్ల మేర కట్ చేసి ఆపరేషన్ చేయాలి. దీనివల్ల టిష్యూ హ్యాండ్లింగ్ ఎక్కువగా ఉంటుంది. రక్తం చాలా పోతుంది. చర్మాన్ని మళ్లీ కుట్టుకుంటూ రావడం వల్ల నొప్పి కూడా అధికంగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి.

ఫ్యూచర్లో కుట్లు వేసిన దగ్గర ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ రొబోటిక్ సర్జరీలో పొట్ట మీద చిన్న హోల్ చేసి కెమెరాను శరరీంలోకి పంపిస్తారు. పక్కనే మరో చిన్న రంధ్రం చేసి సర్జికల్ పరికరాన్ని లోపలికి పంపుతారు. తర్వాత కంప్యూటరైజ్డ్ త్రీడీ మాస్టర్ కన్సోల్ సెంటర్ ద్వారా రోబోను మానిటర్ చేస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఆపరేషన్ తర్వాత రోబోనే రంధ్రాలకు కుట్లు వేస్తుంది. ఈ ప్రాసెస్‌లో కోత తక్కువ. ఇన్ ఫెక్షన్ రేటు ఉండదు. పైగా రికవరీ ఫాస్ట్‌గా ఉంటుంది.

న్యూరో విభాగంలోనూ సర్జికల్ రోబోల వినియోగం పెరుగుతోంది. న్యూరో సర్జరీల కోసం ప్రత్యేక రోబోటిక్ సర్జరీ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మొదటిది న్యూరో మేట్. ఇరవై సంవత్సరాల క్రితమే ఇది వినియోగంలోకి వచ్చింది. న్యూర్ మేట్ వచ్చిన మొదటి పన్నెండేళ్లలో 8వేలకు పైగా బ్రెయిన్ సర్జరీలు జరిగాయి. ఆ తర్వాత న్యూరో ఆర్మ్ పేరుతో తొలి ఎంఆర్ఐ. కంపాటబుల్ సర్జికల్ రోబోను రూపొందించారు. దానిసాయంతో సులభంగా న్యూరో సర్జరీలు చేస్తున్నారు.

అత్యంత సున్నితమైన మెదడుకు సంబంధించిన ఆపరేషన్లలో సర్జికల్ రోబోట్లు డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కంటి శస్త్రచికిత్సల్లోనూ రోబోలను వాడుతున్నారు. గత సెప్టెంబర్ లోనే మొట్టమొదటి రోబోటిక్ ఐ ఆపరేషన్ నిర్వహించారు. కంటిలోపలి భాగంలోకి ప్రవేశించి మిల్లీమీటరులో వందోవంతు భాగానికి కూడా నేర్పుగా శస్త్రచికిత్స చేయగల అత్యాధునిక సర్జికల్ రోబోలు కూడా వచ్చాయి.

కీలకమైన కార్డియాలజీ విభాగంలో కూడా సర్జికల్ రోబోలు విశేష సేవలందిస్తున్నాయి. రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ఉపయోగించి గుండెకు సంబంధించిన మూడు రకాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఏట్రియల్ సెప్టల్ లోపాలను సరిచేయడంలో రోబోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గుండె పైరెండు గదుల మధ్య రంధ్రాలను రోబోల ద్వారా పూడుస్తున్నారు.

ఇక రెండోది- కరోనరీ బైపాస్ సర్జరీ. కరోనరీ దమనులు పూడుకుపోయిన సందర్భాల్లో రోబో సర్జరీ ద్వారా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరిస్తున్నారు. మూడోది- మిట్రియల్ వాల్వ్ రిపేర్. గుండె సంకోచించినపుడు పై గదులలోని రక్తం ఒకగదిలోంచి మరోగదిలోకి ప్రవేశించకుండా నిరోధించే కవటాన్ని సర్జికల్ రోబోల ద్వారా రిపేర్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోబోల సాయంతో కరోనరీ బైపాస్‌లు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. అంతేకాదు, సర్జికల్ రోబోల ద్వారా రేనల్ ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా నిర్వహిస్తున్నారు.

రెండువేల సంవత్సరంలో అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. డావెన్సీ సర్జికల్ సిస్టమ్‌కు ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రోబోటిక్ సర్జరీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో కూడా కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు డావెన్సీ సర్జికల్ సిస్టమ్‌తో ఆపరేషన్లు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఈ రోబోటిక్ సర్జరీ సౌకర్యం ఉంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి రోబోలతో ఆపరేషన్లు చేశారు. అత్యాధునికమైన రొబోటిక్ టెక్నాలజీతో ఇటు డాక్టర్లు, అటు పేషెంట్లు ప్రయోజనం పొందుతున్నారు. భవిష్యత్తులో వైద్య రంగానికి సంబంధించి మరిన్ని కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*