పీఠం మీద ఇమ్రాన్ ఖాన్ ఉంటే ఇండియాపై ఎఫెక్ట్ ఏంటి?

పదేళ్ల క్రితం వరకు అనామకంగా ఉన్న తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ ఈసారి ఎన్నికల్లో ఏకంగా అధికారం చేపట్టే స్థాయికి చేరింది. సైన్యానికి అనుకూలంగా మారడం, ఇస్లామిక్ గ్రూపులతో చేతులు కలపడం, ఉగ్రతండాల పట్ల అవలంబిస్తున్న సానుకూల వైఖరి ఆయనను ప్రధాని పీఠం ఎక్కేలా చేసింది. దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ ఖాన్ రాకతో భారత్ – పాక్ సంబంధాల్లో ఎలాంటి మార్పు రాబోతోంది? ఇమ్రాన్ ఎన్నిక భారత్ కు లాభమా, నష్టమా?

మార్పు సహజం. పాకిస్థాన్ అందుకు అతీతం కాదు. 70 ఏళ్ల దేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న రెండో అధికార బదిలీ ప్రక్రియలో పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపారు. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు అధికారపీఠం అప్పజెప్పాలని నిర్ణయించారు. ప్రపంచం దృష్టిలో ఇమ్రాన్ ఓ క్రికెట్ దిగ్గజం, మరో కోణంలో చూస్తే రొమాంటిక్ హీరో. అమ్మాయిల కలల రారాజు. కానీ స్వదేశంలో ఇప్పుడు ఆయనో రాజకీయ సంచలనం. కరుడుగట్టిన ఇస్లామిక్వాది అయిన ఇమ్రాన్ ఏకకాలంలో తీవ్రవాద సంస్థలతో ఇటు సైన్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అతివాద భావజాలన్ని సమర్థిస్తూ తాలిబాన్ ఖాన్ అనే విమర్శను ఎదుర్కొంటున్నారు. అయినా తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధినేతగా ఇమ్రాన్ ఖాన్ కోట్ల మంది పాకిస్థానీల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధినేత నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లడం, మరో ప్రధాన పక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వ లేమి, చిన్నా చితకా ఇస్లామిక్ పార్టీలు బలంగా లేకపోవడం ఇమ్రాన్ కు కలిసివచ్చింది. అటు సైన్యం, ఇటు పాక్ ఐఎస్ఐ, మరోవైపు ఇస్లామిక్ ఛాందసవాదులు ఇమ్రాన్ విజయానికి తమ వంతు సహకారం అందించారు. క్రికెటర్ గా, పొలిటీషియన్ గా 65ఏళ్ల జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఇమ్రాన్ ఖాన్ ఆక్స్ ఫర్డ్ లో విద్యనభ్యసించారు. 1992లో ప్రపంచ కప్ గెలిచిన పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయిన ఆయన.. క్రికెటర్ గా ఉన్నప్పుడే తల్లి పేరుతో దేశంలో మొట్టమొదటి కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. నిరుపేదలైన యువత కోసం యూనివర్సిటీని స్థాపించారు.

 

ఇమ్రాన్ పాక్ అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఆషామాషీగా జరిగిన వ్యవహారం కాదు. అవినీతిలో కూరుకుపోయిన నవాజ్ షరీఫ్ ను జైలుకు పంపి, ఇమ్రాన్‌ను గద్దెనెక్కించేందుకు పాక్ సైన్యం చాలాకాలం నుంచే పావులు కదిపింది. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న పాకిస్థాన్‌లో సైన్యమే సర్వస్వమై పనిచేయడం ఇమ్రాన్ కు వరమైంది. మరోవైపు అతివాద ఇస్లామిస్టులతో ఉన్న సంబంధాల కారణంగా ఇమ్రాన్ స్వదేశంలో ఉగ్రవాదం, హక్కానీ నెట్ వర్క్, లష్కరే తొయిబాల గురించి పల్లెత్తు మాట మాట్లాడడు. ఆ కారణంగానే పలువురు కరుడుగట్టిన ఇస్లామిక్ అతివాదులు ఇమ్రాన్ పార్టీలో చేరారు. నిజానికి తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ 1997 నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 1997లో 272 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 2002 ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2008 -13 మధ్య ఆసిఫ్ అలీ జర్దారీ హయాంలో ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోవడం ఇమ్రాన్ పార్టీకి కలిసొచ్చింది. 2013 ఎన్నికల్లో 35 సీట్లు గెల్చుకున్న తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ ఈసారి ఏకంగా అధికారానికి చేరువైంది.

 

దాయాది దేశమైన పాకిస్థాన్ లో జరిగే ప్రతి రాజకీయ పరిణామం భారత్ పై ప్రభావం చూపుతుందన్నది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ గెలుపుతో భారత్ – పాక్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ చాలా కాలంగా భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారు. దేశ ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్న ఇమ్రాన్ ఖాన్.. పార్టీ పెట్టిన కొత్తలో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, అవినీతిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే 2013 ఎన్నికల్లో తర్వాత వైఖరి మార్చుకున్నారు. మత ఛాందసవాదిగా మారడంతో పాటు సైన్యానికి దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అధికారం చేపడితే పాలనలో మళ్లీ సైన్యం జోక్యం పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే భారత్ కు సమస్యలు తప్పవని వారంటున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో సైన్యం మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో హంగ్ రావాలని ఆశించిన పాక్ ఆర్మీ.. చక్రం తిప్పడం ఖాయం. ఈ పరిణామం భారత్ కు ఏ మాత్రం మంచిది కాదు.

ఉగ్రవాదులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఇమ్రాన్ పాలనాపగ్గాలు చేపట్టాక పాక్‌లోని భారత వ్యతిరేక ఉగ్ర సంస్థలకు మరింత బలం చేకూరుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఉద్రిక్తతలు పెంచి, భావోద్వేగాలను రగిల్చే కశ్మీర్ లాంటి అంశాల జోలికి పోలేదు. అయినప్పటికీ ఎన్నికలయ్యాక ఆయన భారత్ పట్ల పూర్తి సానుకూల వైఖరి అవలంబిస్తారని భావించలేమని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం నవాజ్ షరీఫ్. భారత్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించే నవాజ్ షరీఫ్ అంటే ఇమ్రాన్‌కు ద్వేషం. నరేంద్రమోడీతో ఆయనకున్న సాన్నిహిత్యం కూడా పాక్ ఆర్మీ కన్నెర చేయడానికి ప్రధాన కారణం. ఫలితంగా ఇమ్రాన్ అధికారం చేపట్టిన తర్వాత కాశ్మీర్ విషయంలో గానీ ఇతర అంశాల్లో గానీ భారత్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుతారన్న ఆశలు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రపంచదేశాల దృష్టిలో పాక్ విలన్ కావడానికి నవాజ్ షరీఫ్ కారణమని ఇమ్రాన్ తరుచూ ఆరోపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ అవినీతి, విదేశాంగ విధానాల వల్ల అంతర్జాతీయ సమాజంలో పాక్ క్రియాశీల, ప్రగతి శీల పాత్ర పోషించలేకపోయిందని, దేశ ప్రతిష్ఠ మసకబారిందని ఇమ్రాన్ నమ్ముతారు. భారత్‌తో నవాజ్ సత్సంబంధాలు కొనసాగించడం కూడా ఇమ్రాన్‌కు ఏ మాత్రం నచ్చలేదు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో నవాజ్ అనుసరించిన ఏ మార్గాన్ని ఇమ్రాన్ అనుసరించరన్నది సుస్పష్టం. ఇది భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెట్టే అవకాశముంది.

 

టెర్రరిస్టు గ్రూపులను వెనకేసుకొచ్చే ఇమ్రాన్‌కు పాక్‌లో తాలిబాన్ ఖాన్ అనే పేరుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌తో ద్వైపాక్షిక శాంతి చర్చలను బారత్ 2013లోనే నిలిపేసింది. 2015లో నరేంద్రమోడీ ఆకస్మికంగా పాక్‌లో పర్యటించడం మినహాయిస్తే రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు లేవు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత సంబంధాలు మరింత దిగజారాయి. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య కాల్పులు నిత్య కృత్యమయ్యాయి. మరోవైపు పాకిస్థాన్, చైనాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. భారత్‌పై అక్కసుతో ఉన్న డ్రాగన్ కంట్రీ.. సొంత లాభం కోసం పాక్‌లో బిలియన్ డాలర్లు గుమ్మరిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్, పాక్ మధ్య సంబంధాలు దిగజారడానికి చైనా తనవంతు పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ప్రభావం, సైన్యం ఒత్తిడి, డ్రాగన్ డైరెక్షన్ లో ఇమ్రాన్ ఖాన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఇక ఇమ్రాన్ రాకతో వేర్పాటువాదులకు కొత్త శక్తి వస్తుంది. పాక్ ప్రోద్బలంతో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయి కాశ్మీర్లో మళ్లీ హింసను చెలరేగే అవకాశం లేకపోలేదు. అందుకే ఇమ్రాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*