
ఇస్లామాబాద్: 22 ఏళ్లుగా చేస్తున్న తన పోరాటానికి ప్రతిఫలం దక్కిందని, తన కల నెరవేరిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి 119 స్థానాలు దక్కాయి. మెజార్టీకి 18 స్థానాలు తక్కువయ్యాయి. మ్యాజిక్ మార్క్ 137. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ ఎన్ పార్టీకి 63 స్థానాలు, భుట్టో కు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి 38 స్థానాలు దక్కాయి. ఇండిపెండెంట్లు, చిన్నా చితకా పార్టీలతో కలిపి ఇమ్రాన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
జిన్నా ఆశయ సాధనకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పాక్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఉగ్రవాద దాడులు జరిగినా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన భద్రతా బలగాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేదరికం పెద్ద సవాలుగా మారిందన్నారు. ఈ విషయంలో చైనా నుంచి ఎంతో నేర్చుకోవాలని 30 ఏళ్లలో చైనా 70 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందన్నారు. చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఉప ఖండానికి కూడా దీని వల్ల మేలు జరుగుతుందని ఇమ్రాన్ చెప్పారు. భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే వ్యక్తుల్లో తానూ ఉన్నానని, తనను భారత మీడియా తనను వ్యతిరేకంగా చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Be the first to comment