మానవ అక్రమరవాణా నిరోధక బిల్లుపై ఎంపీ కవిత ప్రసంగం

మన దేశంలో ప్రతీ 8 నిమిషాలకు ఓ చిన్నారి కిడ్నాప్ కు గురవుతోంది. ఇది చాలా విచారించదగ్గ పరిణామం. ప్రతీ ఏడాది వేలాది మంది మహిళలు, బాలికలు, ఇతరలను.. మాఫియా ముఠాలు తరలించి వెట్టిచాకిరీ కార్మికులుగా, బలవంతపు పనుల్లో చేర్చుతున్నాయి. మిగిలిన వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. మానవ అక్రమ రవాణాలో భారతదేశం దక్షిణ ఆసియాలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కూడా తన 2018 వార్షిక నివేదికలో. మనదేశాన్ని టైర్ టూ దేశంగా చేర్చింది. మానవ అక్రమ రవాణా కేసుల్లో నేరాల నిర్దారణ, విచారణ, ప్రాసిక్యూషన్ లో తీవ్ర జాప్యమే ఇందుకు ప్రధాన కారణం.
ఒక్క 2016వ సంవత్సరంలోనే మన దేశంలో లక్షా11 వేల, 569మంది చిన్నారులు కిడ్నాపయ్యారు. కేవలం 55 వేల 944 మందిని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన వారి జాడ కూడా తెలియని దుస్థితి. దీనిపై కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం దురదృష్టకరం. ఇప్పటికైనా సంబంధిత శాఖా మంత్రి .. పెద్ద మనసుతో స్పందించాలి. దేశంలో ఇలాంటి పరిస్థితుల నడుమ మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లు సభ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాను. టీఆరెస్ తరఫున ఈ బిల్లును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాం.

బిల్లుకు మద్ధతివ్వడానికి నాలుగు ముఖ్య కారణాలు

ఇప్పటి వరకూ ఉన్న చట్టాల్లో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సరైన కార్యాచరణ లేదు. బాధితులు , సాక్ష్యులను కాపాడేందుకు చట్టపరంగా సరైన విధానమే లేదు. దోషులను విచారించి శిక్షించేందుకు ఎలాంటి కాలపరిమితి లేదు. ఇక బాధితులకు నిర్ణీత గడువులోగా పునరావాసం కల్పించడం, బాధితులను స్వస్థలానికి తీసుకువచ్చే నిబంధనలు కూడా లేవు. ఈ లోపాలన్నింటినీ .. ఇప్పుడు తీసుకువస్తున్న చట్టంలో పరిష్కరించే ఏర్పాట్లు చేయడం.. అభినందనీయం. మనం మానవ అక్రమ రవాణా నిరోధకబిల్లుపై చర్చిస్తున్నప్పుడు .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి తప్పక గుర్తుచేసుకోవాలి.

మహిళలు, బాలికల అక్రమ రవాణా తీవ్రంగా ఉన్న 115 గ్రామాలను గుర్తించి ..వాటి అభివృద్ధికి, అక్కడి జీవన ప్రమాణాలను పెంచేందుకు.. ప్రధాని స్వయంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది బాధిత వర్గాలకు ఎంతో భరోసానిస్తుంది. మానవ అక్రమరవాణాను చాలావరకు అరికట్టేందుకు దోహదం చేస్తుంది. ప్రధాని కృషికి మా అభినందనలు. ఇక బాధితుల రక్షణపై ఇప్పటిదాకా ఉన్న చట్టాలు దృష్టిపెట్టలేదు. శశీథరూర్, ఇతర నేతలు మాట్లాడుతూ ఈ సమస్యలను కూడా గత బిల్లుల్లో ప్రస్తావించామన్నారు. కానీ.. ఈ బిల్లులోలా బాధితులు, వారి రక్షణపై స్పష్టమైన కార్యాచరణ వాటిలో లేదు. నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్టు ఈ బిల్లులో పొందుపరిచారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం.

ఈ బ్యూరో జాతీయ స్థాయిలోనే కాకుండా.. రాష్ట్రాలు, జిల్లాల్లోనూ కార్యాలయాలు, వ్యవస్థ కలిగి ఉంటుంది. తద్వారా బాధిత ప్రజలతో నేరుగా మాట్లాడి.. సమస్యలు తెలుకొని పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి ప్రయత్నం. ఇక స్థానిక పోలీసులు, అధికారుల సహాయంతో.. బాధితులు, సాక్ష్యుల వివరాలు గోప్యంగా ఉంచేలా నిబంధనలు తేవడం.. ఈ బిల్లులోని మరో మంచి విషయం

ఇక నేరస్తుల విషయానికి వస్తే .. మన దేశంలో ప్రతీ నేరానికి తగిన శిక్ష విధించేలా చట్టాలున్నాయి. అత్యంత కిరాతకమైన నేరాలకు కూడా తగిన శిక్ష విధించేలా పటిష్టమైన చట్టాలున్నాయి. ఐనా..ఇలాంటి నేరాలకు పాల్పడేందుకు నేరస్తులు భయపడటం లేదు. తప్పుచేసిన వెంటనే శిక్షఅనుభవించాల్సి వస్తుందనే భయం లేకపోవడమే ఇందుకు కారణం. ఏళ్లపాటు కోర్టుల్లో కేసు విచారణలు సాగి.. బాధితులకు న్యాయం జరిగేలోగా.. పుణ్యకాలం గడిచిపోతుంది. దీన్ని అరికట్టేలా.. కేవలం ఏడాదిలోగా కేసుల విచారణ పూర్తి చేయాలని ఈ బిల్లులో నిబంధన చేర్చడం .. అత్యంత కీలకమైన పరిణామం. ఇందుకోసం జిల్లాలకు స్పెష్ కోర్టులు, అదనంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను నియమించడాన్ని స్వాగతిస్తున్నాం.

ఇక ఈ బిల్లులో మరో చక్కని నిర్ణయం.. ఇన్ కెమెరా విచారణకు అనుమతించడం. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బాధితులు, సాక్ష్యులు విచారణలో పాల్గొనేలా అనుమతించడం ఈ ప్రభుత్వం తీసుకున్న సున్నితమైన, హృద్యమైన నిర్ణయం. బాధితులు, సాక్ష్యులు నేరుగా విచారణ ఎదుర్కునేటప్పుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. మానసికస్థైర్యం లొపిస్తుంది. అలాంటి వారికి.. ఈ నిర్ణయం ఎంతో ధైర్యాన్నిస్తుంది. కేసు విచారణలో కీలకంగా మారుతుంది.

ఇక బాధితుల పునరావాసంపై మరింత స్పష్టత రావాల్సిఉంది. బాధితులను స్టేట్ హోంకు తరలించడం కంటే ఇంకేం చేయలేమని చాలామంది సభ్యులు అభిప్రాయపడ్డారు. ఐతే.. దానికి కొనసాగింపుగా ఎన్జీవోలు, అనేక కమ్యునిటీలను కూడా ఈ బిల్లు ద్వారా భాగస్వామ్యులను చేశారు. ఈ అంశంలో దీన్ని ఓ ముందడుగుగానే చూద్దాం. ఈ బిల్లుకు, ఈ ప్రభుత్వానికి మనమంతా ఓ అవకాశం ఇవ్వాలని మా అభిప్రాయం.

 

బిల్లుకు టీఆర్ఎస్ తరపున పలు సూచనలు

1. మానవ అక్రమ రవాణా నిరోధానికి కేంద్రం హోంశాఖ ప్రత్యేక వెబ్ సైట్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 264 జిల్లాల్లో ప్రత్యేక యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది. వాటిని 332 కు పెంచాలని నిర్ణయించారు. ఇది మంచిదే ఐనా.. మహిళా, శిశు సంరక్షణశాఖ, హోంశాఖ కలిసి పనిచేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిపార్ట్ మెంట్లకు అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి.. పెద్దగా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు.

2. లోక్ సభ స్పీకర్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వధార్ గృహాలను కూడా బిల్లులో భాగంగా చేర్చాలని కవిత సూచించారు. స్వధార్ హోమ్స్ కు ఈ బడ్జెట్ లో రూ. 50 వేలకోట్ల నిధులు కేటాయించిన సంగతి గుర్తుచేశారు. అటు..మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో చర్యలపై దృష్టిపెట్టకపోవడంపై .. ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఓ వ్యవస్థీకృత నేరమని గుర్తుచేశారు. ఓ యువతినో, మహిళనో అపహరించేందుకు ముందు… మాఫియా ముఠా ఆరునుంచి 8 నెలలపాటు ప్రణాళిక అమలుచేస్తుంది. ఆమెను నమ్మించి ఆబ్బాయితో పెళ్లిచేసి.. విదేశాలకు తరలిస్తారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులోకూడా అంతే వ్యవస్థీకృతమైన చర్యలు ఉండాలన్నారు. అక్రమంగా తరలించినవాళ్లలో అధికశాతం వెట్టిచాకిరీ, బలవంతపు పనుల్లో మగ్గిపోతున్నారు. మిగిలిన వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు.

వెట్టిచాకిరీ, బలవంతంగా పనిచేయించడాన్ని నిరోధించేందుకు .. కార్మిక విభాగాలతో చర్చించకపోవడం.. ఈ బిల్లులో ప్రధాన లోపమన్నారు ఎంపీ కవిత.రూల్స్ ఏర్పాటు చేసేటప్పుడైనా ఈ పొరపాట్లను సవరించాలని సూచించారు. ఇక మనదేశంలో డ్రగ్స్ సరఫరా , మానవ అక్రమ రవాణా కేసుల్లో విదేశీయులే సూత్రధారులుగా తేలుతున్నారు. ఐతే.. విదేశీయుల పాత్ర, వారిపై చర్యల గురించి బిల్లులో దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. దీన్ని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*