పానగల్ చింతకాయలు తింటే సంతానం కలుగుతుందట!

మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు గానీ అక్కడ చింతకాయలకు మాత్రం మహిమలు ఉన్నాయట! ఆ చింతకాయలను తింటే సంతాన భాగ్యం కలగడమే కాదు.. కొన్ని రకాల వ్యాధులు కూడా నయం అవుతాయని స్థానికుల విశ్వాసం. పానగల్ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ఎర్ర చింతకాయల చెట్టు విశిష్టత గురించి స్పెషల్ స్టోరీ..

పైకి మామూలు చింతకాయల్లానే కనిపించినప్పటికీ.. లోపల ఉండే చింత గుజ్జు మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. ఎర్రగా ఉందని పండిన చింత కాయ అనుకోకండి. ఇవి పచ్చికాయలే! తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయంలోనే ఇలాంటి ఎర్ర చింతకాయల చెట్టు ఉంది. మళ్లీ నల్లగొండ పక్కనే ఉన్న చారిత్రక పానగల్ గ్రామంలో మాత్రమే ఇలాంటి ఎర్ర చింతకాయలు కనిపిస్తాయి. ప్రఖ్యాత పానగల్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ఈ చింతచెట్టు వయస్సు 800 ఏళ్లు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఇంతవరకు చింతచెట్టు ఎప్పుడూ ఎండిపోలేదట! ఏ సీజన్‌లో అయినా విరగకాస్తుందట. చెట్టుకు కాసిన కాయలన్నీ లోపల ఎర్రగానే ఉంటాయి. అందుకే ఈ చెట్టును ఎర్ర చింతకాయల చెట్టు అని పిలుస్తారు.

పానగల్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న ఈ చింతచెట్టుకు మహిమలు ఉన్నాయని స్థానికుల విశ్వాసం. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తారు. ఎవ్వరూ చింతకాయలను తెంచే ధైర్యం చేయరు. కర్రతో, రాళ్లతో చింతకాయలను తెంపిన వారికి పాపం చుట్టుకుంటుందని బలంగా నమ్ముతారు. చింతకాయలు వాటంతటవే రాలిపడ్డప్పుడు మాత్రమే తీసుకుని తింటారు. పిల్లలు లేని వారు ఈ ఎర్ర చింతకాయలు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి వారి ప్రగాఢ నమ్మకం. పూర్వం పానగల్ ఆలయంలో వంశపారంపర్యంగా స్వామి వారిని పూజించిన పూజారులు.. ఎర్ర చింత కాయలతో మూలికలు తయారు చేసేవారట. ఔషధ గుణాలు కలిగిన ఎర్ర చింతకాయలను తింటే స్త్రీలకు సంబంధించిన కొన్ని వ్యాధులు మటుమాయం అవుతాయని స్థానికులు చెప్తున్నారు. క్యానర్స్ మందులో కూడా ఎర్ర చింత కాయలను వాడుతారని తెలిపారు.

క్రీస్తు శకం 1040 నుంచి 1290 సంవత్సరం వరకు చోళ వంశస్తుడైన ఉదయ చోళుడు పానగల్ రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ కాలంలోనే పానగల్‌లో వేంకటేశ్వరుడి ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర ఆలయాలు నిర్మించారు. వందల ఏళ్లుగా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకొని, భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఈ ఆలయాల మాదిరిగానే ఇక్కడి చింతచెట్టు కూడా భక్తులకు మహిమాన్వితంగా మారింది. ఇంత విశిష్టమైన చింతచెట్టు తమ ఆలయంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని స్థానిక భక్తులు చెప్తున్నారు.

2002లో పానగల్ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన చిన్నజీయర్ స్వామివారు ఈ ఎర్ర చింత కాయలను చూసి ఇవి చాలా అరుదైనవి చెప్పారు. తమిళనాడులోని తిరునగరి అనే ప్రాంతంలో 5 వేల ఏళ్ల నాటి చెట్టు ఉందని, ఆ చెట్టు కిందనే వైష్ణవ సాంప్రదాయ గురువు నమ్మాల్వార్ వేదాలను తమిళంలోకి అనువదించారని తెలిపారు. కాబట్టి ఇక్కడి చింతచెట్టు కింద కూడా నమ్మాల్వార్ స్వామివారిని ప్రతిష్టించుకుంటే పానగల్ గ్రామానికి అంతా మంచే జరుగుతుందని చెప్పి వెళ్లారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగానే నమ్మాల్వార్ స్వామిని చింత చెట్టు కింద ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.

పానగల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన వాళ్లంతా తప్పనిసరిగా ఎర్ర చింతకాయల చెట్టును చూసి వెళ్తారు. ఆ మధ్య కొందరు విదేశీయులు కూడా పానగల్కు వచ్చినప్పుడు అరుదైన ఈ చింత చెట్టును పరిశీలించి వెళ్లారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*