ప్రియుడి కోసం భర్తను చంపిన స్వాతికి బెయిల్ మంజూరు

మహబూబ్‌నగర్: భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసి ఆయన స్థానంలో ప్రియుడు రాజేశ్‌ను భర్తగా చెలామణి అయ్యేలా చేద్దామనుకున్న స్వాతికి బెయిల్ లభించింది. అయితే ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులెవరూ రాలేదు. దీంతో అధికారులు ఆమెను స్టేట్ హోంకు తరలించారు.

ప్రియుడు రాజేశ్‌కు ఇంకా బెయిల్ రాలేదు. దీంతో ఆమె ఏకాకి అయిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం అజ్జకోలు గ్రామానికి చెందిన రాజేష్‌ అనే ఫిజియోథెరపిస్ట్‌తో స్వాతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక చివరకు భర్త సుధాకర్‌రెడ్డిని అడ్డు తొలగించుకున్నారు.

సుధాకర్‌రెడ్డి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే దాడి చేసి శవాన్ని కారులో తీసుకెళ్లి నవాబుపేట ప్రాంతంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక రాజేశ్ తన మొహంపై యాసిడ్ పోసుకున్నాడు. రాజేశ్‌ను తన భర్త సుధాకర్‌రెడ్డి అని కుటుంబ సభ్యులను భ్రమింప చేసిన స్వాతి గుర్తు తెలియని వ్యక్తులెవరో దాడి చేశారంటూ అతడిని ఆసుపత్రికి తరలించింది. మొహానికి బ్యాండేజ్‌లు ఉండటంతో రాజేశ్‌నే సుధాకర్ రెడ్డి అని అంతా అనుకున్నారు.

అయితే గాయాలు తగ్గడానికి మటన్ సూప్ తాగాలని సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సూచించగా అతడిగా చెలామణి అవుతున్న రాజేశ్ తిరస్కరించాడు. అనుమానం వచ్చిన సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించి అసలు విషయాన్ని బయటపెట్టారు.

స్వాతి, రాజేశ్ కలిసి సుధాకర్ రెడ్డిని చంపేశారని తేల్చారు. చూడటానికి రాజేశ్‌, సుధాకర్ రెడ్డి ఒకేలా ఉండటంతో అతడి స్థానంలో రాజేశ్‌నే సుధాకర్ రెడ్డి అని నమ్మించాలని చూసి అడ్డంగా దొరికిపోయారు. ఘటనతో స్వాతి కుటుంబసభ్యులు విలవిలలాడిపోయారు. ఆమె తండ్రి అయితే తన కుమార్తె చనిపోయిందంటూ ఏకంగా గుండు కొట్టించుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*