ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో గతరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రామ్లీలా మైదానం, ఢిల్లీ సివిక్ సెంటర్, జాకీర్ హుస్సేన్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. కుంభవృష్టి కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఘజియాబాద్లో విరామం లేకుండా వర్షం కురుస్తుండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వరదనీటి కారణంగా మీరట్ లో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రతాప్ పురాలోని అండర్ పాస్ లో వర్షపు నీరు చేరడంతో పలువురు ప్రయాణికులు వరదలో చిక్కుకుపోయారు. స్థానికుల సహకారంలో వారు బయటకు వచ్చారు.

ఉత్తరాఖండ్ పైనా వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. ముస్సోరీలో కెంప్టీ జలపాతం వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమాన్, పంత్ నగర్, బన్బాసా, హల్ద్వానీ, దార్ చూలాల్లో రెండు రోజులుగా వర్షం నిరంతరంగా కురుస్తూనే ఉంది. మరో 24 గంటల పాటు వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

హిమాచల్ ప్రదేశ్, హర్యానాల్లో వర్షాల కారణంగా జన జీవనం స్తంభించింది. హిమాచల్ లోని కులూ జిల్లాలోనే నేషనల్ హైవే నెంబర్ 305 పైకి భారీగా వరద నీరు చేరింది. రోడ్లపై బురద నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హర్యానాలోని ఫరీదాబాద్ సెక్టార్ 8 లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. యమునా నగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజ్ వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*