
పానీపూరీ అంటే చిన్నాపెద్దా తేడాలేకుండా ఎలా ఎగబడి తింటారో హైదరాబాదీలకు పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక్క మన దగ్గరేం ఖర్మ, దేశంలో ఎక్కడికి వెళ్లినా పానీపూరీ అంటే ఇదే క్రేజ్. బండి కనిపిస్తే చాలు అది మురికి కాలువ పక్కన ఉన్నా పట్టించుకోరు. కంపు వాసన వస్తున్నా మైమరిచిపోయి లొట్టలేసుకుంటూ తింటారు. కానీ ఒక్కసారి ఆ పూరీలు ఎలా చేస్తారో, మసాలా తయారీ ఎలా వుంటుందో చూస్తే జన్మలో వాటి జోలికి పోరు.
వడోదరలో అదే జరిగింది. అడ్డగోలుగా పానీపూరీ తయారుచేస్తుంటే..అవి తిని జనాలు రోగాల బారిన పడుతున్నారనే ఫిర్యాదులతో, కార్పొరేషన్ టీం రంగంలోకి దిగింది. సిటీ వ్యాప్తంగా పానీపూరీ కార్ఖానాలను తనిఖీ చేసింది. అందులో ఏ ఒక్కటి కూడా కనీస ప్రమాణాలు పాటించలేదని తేల్చి అన్నిటినీ సీజ్ చేసింది. అంత భయంకరంగా ఉంది మరి వాళ్ల తయారీ విధానం. దాదాపు 4వేల కేజీల పూరీలను ధ్వంసం చేశారు. 3500 కిలోల ఆలూ, బఠానీలను పారబోశారు. 1200 లీటర్ల కట్టాపానీని మురిక్కాలువలో పోశారు. ఇకపై వడోదరలో ఒక్కరి నోటినుంచి కూడా పానీపూరీ అనే మాట రాకుండా చేశారు.
Be the first to comment