సినారేను ఈ నేల ఎన్నటికీ మరవదు

హైదరాబాద్: పద్యాన్ని, గేయాన్ని ఒద్దికగా నడిపించగల దిట్ట సినారే. ఛందోరహస్యం తెలిసిన సి.నారాయణరెడ్డి.. వచన కవిత్వాన్ని నాజూగ్గా నడిపించి ఆ ప్రక్రియకే వన్నె తెచ్చారు. సినారే కావ్యాల్లో మధ్యతరగతి వాడి జీవితం కళ్లకు కడుతుంది. తిలక్ లాగా సినారే కలం కూడా రెండంచుల పదును గల కత్తి! ఆయన తన కవిత్వంలో అగ్ని చల్లగలడు.. అమృతమూ కురిపించగలడు..!!

విశ్వమానవ హృదయాంతరాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి మానవతా దృక్పథానికి అక్షరాలను చెక్కిన శిల్పి డాక్టర్ సినారే! పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయ ప్రవాహాన్ని పోటెత్తించిన కవిచంద్రుడాయన. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం ఆయనకే చెల్లింది. ప్రణయ కవిత్వమే కాదు చారిత్రక గాథలూ ఆయన కలం నుంచి ప్రాణం పోసుకున్నాయి.

పౌర్ణమి నాడు పుట్టిన వాళ్లు కవులవుతారని అంటారు. సినారేని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఆయన నిజ ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున పుట్టారు. పద్నాలుగో ఏటనే ఆయన చేయి కవితలు అల్లడం మొదలు పెట్టింది. సినారె కవితలు ఎంత మధురంగా వుంటాయో.. ఆయన గళం కూడా అంతే మాధుర్యంగా ఉంటుంది. సినారే కవితా కులాలంకారుడు. సాంప్రదాయ ధోరణిలో అనేక పద్యాలు రాశారు. ఆధునిక ధోరణిలో వచన కవితలల్లారు. ఆబాల గోపాలానికి అర్థమయ్యేలా లలితమైన పదాలతో గేయాలు రాశారు. తెలుగులో గమ్మత్తయిన గజల్స్ పాడారు. ప్రణయ గీతాలు.. ప్రబోధ గీతాలు.. భావ గీతాలు.. భావోద్వేగ గీతాలు- ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలను అందించారు. కళామతల్లి కంఠహారంలో కవితా కుసుమాలు పొదిగారు. రుతుచక్రం తిప్పి కర్పూర వసంత రాయలును పిలిచారు. ప్రపంచ పదులు చెప్పి గదిలోకి సముద్రపు అలల్ని మోసుకొచ్చారు.

సినారేది అలుపెరగని సాహితీ వ్యవసాయం. అందుకే ఆయన విశ్వంభరుడై జ్ఞానపీఠమెక్కారు. భూమి పుట్టుక నుంచి నేటి ఆధునిక సమాజం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను తన విశ్వంభర కావ్యంలో గుదిగుచ్చారు. తెలుగే కాదు ఉర్దూ కవిత్వాన్నీ ఔపోసన పట్టారు. పద్మ భూషణడుయ్యారు. సినారే సినీ గీతాలు సాహిత్య పరిమళాలు వెదజల్లాయి. తెలుగు చిత్రసీమలో ఆయన పాట పగలే వెన్నెల కురిపించింది. గులేబకావళి చిత్రంలో -నన్ను దోచుకుందువటే – ఆయన రాసిన మొట్టమొదటి సినీ గేయం. అలా మొదలయిన సినారే సినీ గీతాల ప్రస్థానం ఒక అనంత ప్రవాహంలా సాగింది.

ఆ తరానికి, ఈ తరానికి మధ్య సినారే ఒక కవితా వారధి. ఆయన రాసిన మొట్టమొదటి కవితారూప గేయం నవ్వని పువ్వు. కానీ ఆయన కవితలన్నీ తెల్లని పువ్వులా వికసించాయి. తెలుగు కవితానందన వాటికలో నవరసభరితంగా, అనంత లయాత్మకంగా, ఆనంద సుందరంగా, నవనవోన్మేషంగా ఎన్నో కవితా కుసుమాలను తన అక్షరాల్లో పూయించారు. సినారే పాట పల్లీయులను ఆప్యాయంగా పలకరించింది. అర్బన్ జన సమూహాల్లో చైతన్యం రగిలించింది. మధ్య తరగతుల వచన కవిత్వాన్ని మందహాసంతో పిలిచి, కోటి అనుభూతులను గుమ్మరించింది. అంతటితో ఆగక మహాద్భుతంగా ఒక మహాకావ్యాన్నే సృష్టించింది.

శబ్దానికి అనంతమైన శక్తి ఉంది. జన బాహుళ్యాన్ని ముందుకు నడిపించగల మహత్తర శక్తి ఒక్క కవికే ఉంటుంది. సినారే కూడా అంతటి కవితా యోధుడే. లోక కల్యాణం కోసం నిలవాలనే తపన, లోకంలో మానవతను పెంపొందించాలనే ఆకాంక్ష- ఆయన ప్రతీ పదంలో కనిపిస్తుంది. లోకం తీరుపై సినారే ఆవేదన అక్షరాలుగా గూడు కట్టుకుంది. లోకాన్ని శాంతియుత మార్గంలో నడిపించడానికి ఆయన కవిత అనంతమైన కన్నీరు కురిపించింది. సినారెలో జాతీయత, మానవత కలిగలిసి ఉంది. సమానత, సౌహార్థం ఆయన గేయాల్లో తొణికిసలాడింది. డాక్టర్ సి.నారాయణరెడ్డి వర్తమానంలో జీవించిన కవి మాత్రమే కాదు- వర్తమానాన్ని ప్రేమించిన కవి కూడా. తన కలాన్ని ఉలిగా మార్చి విశ్వమానవతా నగిశీలు చెక్కిన కవితా పుత్రుడు. మానవతా మహోద్యమానికి చివరి శ్వాస వరకూ తన కలాన్ని అంకితం చేసిన సినారేను ఈ నేల ఎన్నటికీ మరవదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*