ఎమ్మెల్యేలతో స్టాలిన్ అత్యవసర భేటీ.. అభిమానుల్లో ఆందోళన

డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోందని వార్తలు వస్తున్న వేళ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యసర సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చెన్నైలోని గోపాలపురంలో ఉన్న తన నివాసానికి ఎమ్మెల్యేలందరూ రావాలని కబురుపెట్టడంతో వారంతా ఆఘమేఘాల మీద చేరుకున్నారు.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. కరుణానిధి అడుగుజాడల్లోనే అందరూ నడవాలని సూచించారు. డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి శుక్రవారంతో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, మరెన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు. ప్రజా జీవితంలో 80 ఏళ్లు ఉన్నారని, పార్టీ పత్రిక సంపాదకుడిగా 75 ఏళ్లుగా కొనసాగుతున్నారని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు కలత చెందారు. తమ నేతకు ఏమీ కాకుడదంటూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. గోపాలపురంలోని ఆయన నివాసానికి ఈ ఉదయం నుంచి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*