అంతకంటే తెలివి తక్కువతనం మరోటి ఉండదు: అక్షయ్ కుమార్

అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలను పోటీ పడి మరీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ‘ఖల్ నాయక్’ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’, తెలుగులో అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రాలు చరిత్ర సృష్టించాయి.

బాక్సర్ మేరీ కోమ్, టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోగ్రఫీలు తెరకెక్కనుంగా, తాజాగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ జీవిత కథతో రూపొందించిన ‘కరన్‌జీత్ కౌర్: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ కూడా వచ్చేసింది. గతంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ బయోగ్రఫీ కూడా వెండితెరకు ఎక్కింది. తెలుగులో దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తుండగా, ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీరామారావు జీవిత చరిత్రను ఆయన కుమారుడు బాలకృష్ణ రూపొందిస్తున్నారు.

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌ను మీ బయోపిక్ ఎప్పుడంటూ ప్రశ్నించినప్పుడు పెద్దగా నవ్వేశాడు. తన జీవిత చరిత్ర ఎప్పుడూ తెరకెక్కదని తేల్చి చెప్పేశాడు. ఒక వేళ అదే జరిగితే (తన బయోపిక్ తీసుకుంటే) అంతకంటే తెలివి తక్కువ పని మరోటి ఉండదన్నాడు. దేశంలో ఇంకా బోలెడన్ని అద్భుతమైన కథలు ఉన్నాయని, ఎందరో ప్రతిభావంతులైన వ్యక్తులు తమ ప్రతిభా పాటవాలతో దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్నారని పేర్కొన్నాడు. తానైతే రియల్ హీరోల చిత్రాలే చేస్తానని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*