మళ్లీ మోదీ రావాల్సిందే: టాప్ హీరోయిన్

ముంబై: 2019లో మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆకాంక్షించారు. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశానికి మోదీలాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందన్నారామె. రాబోయే ఐదేళ్లు మోదీ అధికారంలో ఉంటేనే దేశ సమస్యలు పరిష్కారమౌతాయని ఆమె చెప్పారు. మోదీ ప్రస్తుతం ఉన్న స్థితికి తల్లిదండ్రుల వల్ల రాలేదని, కష్టపడి పైకి వచ్చారంటూ పరోక్షంగా రాహుల్‌కు చురకలంటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి ఘటనల ఆధారంగా దర్శకుడు మంగేశ్ తీసిన ఛలో జీతే హై షార్ట్‌ ఫిల్మ్ ప్రదర్శన సందర్భంగా కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ప్రదర్శించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, సచిన్ టెండుల్కర్ తదితరులు చూశారు. సినిమా చూశాక కంగనా మాట్లాడుతూ మోదీపై ప్రశంసలు కురింపించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మాత్రం కంగనా క్లారిటీ ఇవ్వలేదు.

జీతే హై షార్ట్‌ ఫిల్మ్ ఇవాళ రాత్రి 9 గంటలకు స్టార్ నెట్‌వర్క్, హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ షార్ట్‌ ఫిల్మ్ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కితాబునిచ్చారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. చక్కటి సందేశం అందించే ఈ సినిమాను ఎవ్వరూ మిస్ కావొద్దని సూచించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*