ఆ చెట్టు నీడన ఒకేసారి వెయ్యిమంది సేదతీరొచ్చంటే నమ్మగలరా?

మహబూబ్‌నగర్: ఒక మహావృక్షం! తప్పక చూడాల్సిన మర్రివృక్షం! సుడులు తిరిగిన శివుని జటాజూటాల్లా వేలాడే ఊడలను కళ్లారా చూసి తరించాల్సిందే! గిజిగాడు అల్లుకున్న గూడులా అనేక మెలికలు, మలుపులు తిరిగిన కొమ్మలు, ఊడలతో ఆశ్చర్యం కలిగించే ఈ మహావృక్షాన్ని ఒక్కసారైనా సందర్శించాల్సిందే! ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా… ఇదంతా మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి గురించి చెబతున్న విషయాలని!

ఆ చెట్టు నీడలో దాదాపు వెయ్యిమంది కూర్చొని సేద తీరవచ్చంటే.. కళ్లారా చూస్తేగానీ నిజంగా నమ్మలేం . ఈ మహావృక్షం విస్తీర్ణం మూడెకరాలు. ఈ మర్రి చెట్టుకి విచ్చల విడిగా పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిందీ మహావృక్షం. ఈ చెట్టు ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కూడా చాలా కష్టమైన పనే. ఈ మహా మర్రి వృక్షం పుట్టుకకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.

మహబూబ్ నగర్ జిల్లా చిహ్నంగా వెలిగిపోతున్న పిల్లల మర్రి టౌనుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వటవృక్షాన్ని చూసి బాగా ఎంజాయ్‌ చేస్తారు. శని, ఆదివారాలు కూడా పిల్లల మర్రి సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ వృక్షరాజం భారతదేశంలోనే మూడవ అతి పెద్ద చెట్టు. దూరం నుంచి చూస్తే దట్టమైన చెట్లతో నిండి ఉన్న చిన్నపాటి అవడిలా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే కనీసం ఒక వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా ఉంటుంది.

పిల్లలమర్రి జిల్లా కేంద్రానికి, అడవికి అనుసంధానమై ఉంటుందని చెప్పాలి. ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా మార్చే ప్రయత్నాలు 1947లోనే మొదలయ్యాయి. అప్పటి కలెక్టర్ కాశీపాండ్యన్ తో పాటు ఆ తర్వాత వచ్చిన జిల్లా ఉన్నతాధికారులు క్రమంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తూ వచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ శాఖ పాలమూరు జిల్లాలో ఉన్న పర్యాటక స్థలాలను అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. పిల్లలమర్రిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపడుతోంది.. ఫారెస్ట్ అధికారులు పిల్లలమర్రిని 1976లో ఆటవీ శాఖ పరిధిలోకి తీసుకున్నారు.

పిల్లలమర్రి ప్రాంతంలో మర్రి చెట్టు తర్వాత అంతే ప్రాధాన్యం కలిగింది జింకల పార్కు. పాతికేళ్లుగా ఇక్కడ జింకలను పెంచుతున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా చెక్ డ్యామ్ నిర్మించారు. చెక్ డ్యామ్ కు ఎగువ భాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆ ప్రాంతంలో బోర్లను వేయించి జింకలు కాదు పశుపక్షాదులకు నీటి సౌకర్యం కల్పించింది. నెమళ్లు, చిలుకలు, కోతులు, పావురాలతో పాటు అరుదుగా కనిపించే ఇతర పక్షులను కుడా ఇక్కడ కనిపించి అలరిస్తాయి.

మొదట జింకల పార్కులోకి అడుగుపెట్టగానే అందమైన కళాత్మకమైన స్వాగత తోరణం వెల్ కమ్ చెబుతుంది. వెదురు బొంగులను తలపించే ఇనుపరాడ్లతో చేసిన తోరణం అది. చూడముచ్చటగా ఉంటుంది. మెట్లెక్కి లోపలకి వెళ్తే… జింకల కంటే ముందు నందివిగ్రహం ఎదురువుతుంది. ఆ విగ్రహం ఎప్పుడూ చూసినట్టే అనిపించినా దానిపై ఉన్న ఆర్ట్ వర్క్, డిజైన్ మాత్రం ఆహా… అనిపించేలా ఉంటుంది. మరోవైపు బుద్దుడి విగ్రహం! ఎంతో ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో అంతకంటే ప్రశాంతమైన వదనంతో బుద్దుడి విగ్రహం మనలోనూ ప్రశాంతతను నింపుతుందంటే ఆశ్చర్యం లేదు.

అక్కడ్నుంచి ముందుకెళ్తే గుంపులు గుంపులుగా తిరుగాడే జింకలను చూడొచ్చు. ఇంకా లోపలకి వెళ్తే బర్డ్స్ పార్క్ ఉంటుంది. అనేక రకాల పక్షులు, పాములు వంటివి కనిపిస్తాయి. జింకల పార్క్ లో తిరుగుతుంటే పెద్ద అటవీ ప్రాంతంలో మనకు నచ్చినట్టు అల్లుకున్న బొమ్మరిల్లు లో తిరుగాడుతున్నట్టే అనిపిస్తుంది.

పిల్లల మర్రి మ్యూజియాన్ని కూడా 1976లోనే అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. ఇది వరకు ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న జిల్లా సైన్స్ మ్యూజియాన్ని పిల్లలమర్రికి పరిసరాల్లోకి తరలించారు. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు ఇది అదనపు ఆకర్షణలాగా మారింది. ఇందులో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలు దర్శనమిస్తాయి. పురాతన కాలాల్లోని శిల్ప, శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామగ్రిని ఈ మ్యూజియంలో పర్యాటకుల సందర్శనకు ఉంచారు. క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి 15 శతాబ్దం నాటి శిల్ప పరిణతినీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. హిందు, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దంపట్టే అనేక అపురూప శిల్పాలు ఈ మ్యూజియానికే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. 2 వేల సంవత్సర కాలం నాటి మధ్య రాతి యుగం నాటి శిథిలమైన వస్తువులూ షో కేసుల్లో నుంచి కనిపిస్తుంటాయి. చాళుక్యుల కాలం నుంచి విజయనగరం కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అపార శిల్ప సంపద సదర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

అప్పట్లో శ్రీశైలం ముంపుకు గురైన గ్రామాల్లోని పురాతన దేవాలయాల్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఇక్కడికి తెప్పించి వీటి కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనంలో వాటిని ఏర్పాటు చేశారు. వీటిని ఇక్కడికి వచ్చే పర్యాటకుల సందర్శన కోసమే భద్రపరిచారు. అలాగే ఆటవీ శాఖ ఆధ్వర్యంలో అందమైన పార్కులను ఏర్పాటు చేసి సందర్శకులకు మానసికోల్లాసం కలిగించే వాతావరణం సృష్టించారు. ప్రధాన రహదారి, గేటు నుంచి జింకల పార్కు వరకు రోడ్డుకు ఇరువైపులా వివిధ రకాలు మొక్కలను నాటించి అందంగా తీర్చిదిద్దారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చక్కటి మొక్కలతోపాటు మామిడి, జామ, దానిమ్మ, సపోట వంటి పండ్ల మొక్కలను పెంచుతున్నారు. పండ్ల తోటలు సాగు చేసే వారికి ఇక్కడ శిక్షణ కూడా
ఇస్తున్నారు.

పిల్లలమర్రిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ఐదు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పర్యాటకం, పురావస్తు, అటవీ, ఉద్యానవన, మత్య్స శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. పిల్లల కోసం ఆటస్థలం, సందర్శకుల కోసం పురావస్తు మ్యూజియం, మినీ జూపార్క్, అక్వేరియం విహార యాత్రకు కాస్త విజ్జానాన్ని జోడిస్తాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల ఇక్కడి ఏర్పాట్లు చక్కగా సాగుతున్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన సౌకర్యాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*