లడ్డూ కావాలా నాయనా!.. వగలాడి మాయలోపడి మోసపోతున్న హైదరాబాద్ యవకులు

లడ్డూ కావాలా? అంటూ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే అందమైన అమ్మాయి ఫొటో. దానికిందే వాట్సాప్ నంబర్. ఆశపడి ఫోన్ చేస్తే కవ్వించే స్వీట్ వాయిస్. కాసేపటికే అయితే రూ.3వేలు, రాత్రంతా అయితే రూ.7వేలు. చెప్పిన ఖాతా నంబరులో ఆన్‌లైన్‌లో డబ్బులు జమచేస్తే డీల్ ఓకే అయినట్టే. డబ్బులు ఖాతాలో పడగానే గూగుల్ మ్యాప్‌ ద్వారా లొకేషన్ షేర్ అవుతుంది. దానిని పట్టుకుని వెళ్లాక కానీ తెలియదు.. నిండా మునిగామని. మోసపోయినట్టు తెలుసుకున్న యువకులు కొందరు బయటకు చెబితే పరువు పోతుందన్న భయంతో లోలోపలే కుమిలిపోతుండగా, మరికొందరు మాత్రం పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నారు.

బేగంపేటలో జరిగిన ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. బాధితులు డబ్బులు జమచేసిన వెంటనే వచ్చే లొకేషన్‌కు వెళ్తే.. అది బేగంపేటలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్. అక్కడకు వెళ్లి తిరిగి ఫోన్ చేస్తే ఫలానా ఫ్లోర్‌కు రావాలని, ఏ తలుపు తీసి ఉంటే ఆ గదిలోకి రావాలని చెబుతుంది. నమ్మి వెళ్లాక అసలు విషయం తీరిగ్గా బోధపడుతుంది… తాము వగలాడి మాయలోపడి మోసపోయామని. ఇలా ఒకరు, ఇద్దరు కాదు, వందమందికిపైగా ‘మాయలేడి’ వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. మరోవైపు ఆ అపార్ట్‌మెంట్ వాసులు కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా అపరిచితులు వచ్చి తలపులు కొట్టి ఇబ్బంది పెడుతున్నారు. గంటకొకరు చొప్పున వచ్చి తలపుకొడుతుంటే వారికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. దీంతో మగాళ్లు ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లో ఉండి కాపలా కాయాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఇక ఈ బాధ భరించలేక వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. నెల రోజుల వ్యవధిలో వందమందికిపైగా యువకులు ఆ అపార్ట్‌మెంట్‌కు రావడం కనిపించింది. వారిని పట్టుకుని విషయం తెలుసుకుని 20 మందిపై కేసులు పెట్టారు. వారిచ్చిన నంబరును ట్రేస్ చేసిన పోలీసులకు దిమ్మదిరిగింది. ఆ నంబరు ఒక రోజు చెన్నైలో, మరో రోజు బెంగళూరులో, మరో రోజు నాగ్‌పూర్‌లో ఉన్నట్టు వస్తుండడంతో తమ వల్ల కాదని చేతులెత్తేసిన పోలీసులు కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఓ వెబ్‌సైట్ ద్వారా ఈ వ్యవహారం నడిపిస్తోందని గుర్తించిన దానిని తొలగించగా, మరో వెబ్‌సైట్ పెట్టుకుని మళ్లీ చెలరేగిపోతోంది. దీంతో మరింత సవాలుగా తీసుకున్న పోలీసులు త్వరలోనే ఆమెకు అరదండాలు వేస్తామని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*