పవన్ బాధపడినట్లే నేనూ బాధపడుతున్నా: లోకేశ్

మంగళగిరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్లిచ్చారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే పవన్ ఎలా బాధపడుతున్నారో తనపై నిరాధార ఆరోపణలు చేస్తే తాను కూడా బాధపడతానని లోకేశ్ చెప్పారు. నిరూపించలేని ఆరోపణలు చేయడం తగదన్నారు. తనపై చేసే అవినీతి ఆరోపణలను నిరూపించాలని కోరారు. విధానాల పరంగా తప్పు చేసినట్లు నిరూపిస్తే సరిచేసుకుంటానని లోకేశ్ చెప్పారు. తనపై అసలు పవన్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. పవన్ అంటే తనకు గౌరవముందని లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం ఐదుకోట్ల ఆంధ్రుల కల అంటూ ఆయన నిర్మాణాన్ని అడ్డుకుంటామని పవన్ అనడం సరికాదన్నారు.

తాను అవినీతిపరుడనైతే ఏపీకి ఇన్ని కొత్త కంపెనీలు ఎలా వస్తాయని లోకేశ్ ప్రశ్నించారు. అర్ధంలేని ఆరోపణలు చేస్తే కంపెనీలు రావని సూచించారు. మరోవైపు కాపు రిజర్వేషన్లపై జగన్ ఎప్పుడేం మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. జగన్ వ్యాఖ్యలపై వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. అందుకే ప్రజలు అనుభవమున్న నేత కావాలని కోరుకుంటున్నారని లోకేశ్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*