శాండల్‌వుడ్ నటి సంగీత అసభ్యకర వీడియోలు చిత్రీకరణ.. ఆపై బ్లాక్‌మెయిల్ చేసిన నటుడు ధర్మ

కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన నటుడు ధర్మేంద్ర అలియాస్ ధర్మ‌పై శాండల్‌వుడ్ నటి సంగీత విశ్వనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి అసభ్యకర వీడియోలు చిత్రీకరించాడని, ఆపై వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఇప్పటి వరకు రూ.14 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది మార్చి 1న రాత్రి సంగీత విశ్వనాథ్‌కు ఫోన్ చేసిన ధర్మ రాజరాజేశ్వరి‌నగర్‌‌లో షూటింగ్ ఉందని, అక్కడకు వెళ్లాలని చెప్పాడు. తన డ్రైవర్‌ను ఆమె ఇంటికి పంపించాడు. డ్రైవర్ సంగీతను పికప్ చేసుకుని షూటింగ్ స్పాట్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే ధర్మ అక్కడకు వచ్చి షూటింగ్ రద్దు అయిందని, భోజనం చేసి వెళ్లిపోదామని సంగీతకు చెప్పాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. భోజనం చేసి కూల్‌డ్రింక్ తాగిన తర్వాత సంగీత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

మెలుకవ వచ్చిన తర్వాత ఆమెకు అసభ్యకరంగా ఉన్న ఆమె వీడియోను చూపించిన ధర్మ డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే దీనిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అంతేకాక ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో భయపడిన సంగీత మార్చి 2017 నుంచి మే 2018 వరకు మొత్తం రూ.14 లక్షలు అతడికి ముట్టజెప్పింది.

ధర్మ వేధింపులు మరింత ఎక్కువ అవుతుండడంతో ఈ ఏడాది మే 27న సంగీత, ఆమె భర్త కలిసి ధర్మతో వాగ్వాదానికి దిగారు. తమ నుంచి బలవంతంగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే రోజు రాత్రి సంగీత ఇంటికి వచ్చిన ధర్మ మళ్లీ డబ్బులు కావాలని బెదిరించాడు. ఇవ్వకుంటే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నడ సినిమాల్లో ధర్మేంద్ర ప్రతినాయక పాత్రలు పోషిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*