ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారత్‌కు ఫేవర్ చేసిన పావురం

భారత్-ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుతున్న తొలి టెస్టులో ఎక్కడి నుంచో వచ్చిన ఓ పావురం భారత్‌కు సాయం చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకుంటున్న వేళ పిచ్‌పైకి వచ్చిన పావురం భారత బౌలర్లకు సాయం చేసి తుర్రుమంది.

మ్యా‌చ్‌లో 35 ఓవర్లు పూర్తయ్యాయి. అప్పటికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసి మం‌చి ఊపుమీద ఉంది. టీమిండియా సారథి బౌలర్లను మార్చిమార్చి ప్రయోగిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 36వ ఓవర్‌ను మహమ్మద్ షమీతో వేయించాడు.

ఓవర్ వేసేందుకు బంతి అందుకున్న షమీ బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పావురం పిచ్‌పై వాలింది. క్రీజులో ఉన్న ఓపెనర్ కీటన్ జెన్సింగ్స్ (42), కెప్టెన్ జో రూట్ (80)లు దానిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అది కదలలేదు. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. చివరికి ఎలాగోలా దానిని పిచ్‌పై నుంచి వెళ్లగొట్టాక మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

అయితే, 42 పరుగులు చేసి మాంచి ఊపు మీదున్న జెన్నింగ్స్ పావురం కారణంగా ఆట కాసేపు ఆగిపోవడంతో ఆటపై ఏకాగ్రత కోల్పోయాడు. దీంతో షమీ వేసిన 36వ ఓవర్ తొలి బంతికే బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. జెన్సింగ్స్ అవుటైన తర్వాత భారత బౌలర్లు జోరు పెంచారు. అశ్విన్ అయితే చెలరేగిపోయాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టు వెన్ను విరిచాడు. అప్పటి వరకు బలంగా కనిపించిన ఇంగ్లండ్ జట్టు ఆ తర్వాత టపటపా వికెట్లు రాల్చుకుంది. చివరికి తొలిరోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.

జెన్నింగ్స్ క్రీజులో ఉన్నంత వరకు బలంగా కనిపించిన ఇంగ్లిష్ జట్టు ఆ తర్వాత కుప్పకూలడంతో అభిమానులు నిరాశ చెందారు. జట్టు బ్యాటింగ్ లైనప్‌ను పావురం దెబ్బతీసిందంటూ దానిని తిట్టిపోస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*