జనసేనలోకి మోత్కుపల్లి

హైదరాబాద్: టీడీపీ మాజీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన జనసేన అధినేత పవన్‌ను కలవనున్నారు. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షులుగా మోత్కుపల్లిని నియమించే అవకాశం ఉంది.

నల్గొండలో జన్మించిన మోత్కుపల్లి ఏపీ అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఈయన అద్భుతమైన వక్త. విషయాలను సూటిగా చెప్పగలిగే నేర్పు ఉన్నవారు. దశాబ్దాలుగా ఆయన ప్రజాసేవలో ఉన్నారు. తెలంగాణలో మంచిపేరున్న నేత.

టీడీపీ అధినాయకత్వంతో ఆయనకు విభేదాలు రావడంతో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు విషయం ప్రస్తావించింది మోత్కుపల్లియే. ఈయన ఫార్ములా నచ్చని టీటీడీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంచారు. దీంతో మోత్కుపల్లి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను చంద్రబాబు దెబ్బతీశారని చెప్పారు. వాడుకుని వదిలేశారని వాపోయారు. తనను గవర్నర్ చేస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చి విస్మరించారని గతంలోనే మోత్కుపల్లి ఆరోపించారు. మరోవైపు టీటీడీపీ నేతలు మోత్కుపల్లి ఆరోపణలను ఖండించారు. మరో పార్టీలోకి మారేందుకే టీడీపీ అధినేతపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మోత్కుపల్లి రాకతో తెలంగాణలో జనసేన ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. నిజానికి ఇప్పటివరకూ తెలంగాణాలో జనసేనకు ఉనికే లేదు. అయితే మోత్కుపల్లి చేరికతో తాము బలపడతామని జనసేన శ్రేణులంటున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*