వివక్షలు లేని సమాజంతోనే పింగళి వెంకయ్యకు నివాళి: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: పింగళి వెంకయ్య లాంటి దేశభక్తుణ్ని, స్వతంత్ర సమరయోధుణ్ని గౌరవించుకోవడమంటే భారత జాతీయ పతాకాన్ని గౌరవించుకోవడమే అని, జాతిని సంఘటితం చేసే శక్తి జాతీయ పతాకానికే ఉందని నమ్మిన పింగళి వారికి జాతీయ భావన, సంఘటిత, సమైక్య భారతము, వివక్షలు లేని సమాజం ద్వారానే నివాళి అందించగలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. న్యూఢిల్లీ ఆంధ్రభవన్ లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జరిగిన పింగళి వెంకయ్య 141వ జయంతి సభకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా “జాతీయ జెండాను ఎగరేయడమే తన జీవితంలో అపూర్వ ఘట్టం” అని చెప్పిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మాటల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సైనికుడిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, బహుభాషాకోవిదునిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా, పరిశోధకునిగా, జాతీయ పతాక రూపశిల్పిగా, అన్నింటికీ మించి నిరాడంబర రాజకీయవేత్తగా పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి సంప్రదాయమని ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు జగదాంబ, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు.

 

ఉపరాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

• భారతీయులంతా గర్వంగా తలయెత్తి తిలకిస్తూ, తలవంచి గౌరవించే త్రివర్ణ పతాక రూపకర్త, యావత్ భరత జాతికి ప్రాతఃస్మరణీయులు  పింగళి వెంకయ్య గారి 141వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఒక భారతీయుడిగా గర్వపడుతున్నాను.

• మనదేశ మేటి సంస్కృతిని, భారతీయుల ఘనతను ప్రపంచమంతా చాటి చెప్పే మువ్వన్నెల జెండాకు రూపకల్పన చేసిన  పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం, తెలుగు ప్రజలంతా చేసుకున్న అదృష్టం.

• జాతీయ జెండా అనగానే  అటల్ బిహారి వాజ్ పేయి గారి మాటలు నాకు గుర్తొస్తాయి. “1947 ఆగష్టు 15న ఎర్రకోట మీద ఎగిరిన జాతీయ జెండా ఆయనలో స్ఫూర్తి నింపిందని ఎప్పుడూ చెప్పేవారు. ప్రధాని అయ్యాక ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగరేసిన క్షణమే తన జీవితంలో అపూర్వ ఘట్టమని అంటారాయన. ఆయన్నే కాదు, ఎందరో దేశభక్తుల మనసుల్లో జాతీయ జెండా స్ఫూర్తిని నింపింది.

• సైనికుడిగా, బహుభాషా కోవిదునిగా, వ్యవసాయ పరిశోధకునిగా, ఖనిజ పరిశోధకునిగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన పింగళి వెంకయ్య గారు, మువ్వన్నెల పతాకం రూపకల్పన కోసం ఎంతో శ్రమించారు. మరెంతో తాపత్రయ పడ్డారు. జాతిని సంఘటితం చేసే శక్తి జాతీయ పతాకానికే ఉందని మనసా, వాచా, కర్మణా నమ్మిన వ్యక్తి ఆయన.

• 1878 ఆగష్టు 2న కృష్ణాజిల్లా భట్లపెనుమర్రులో పుట్టిన పింగళి వెంకయ్య గారు చిన్నతనం నుంచే చాలా చురుకైన విద్యార్థి. తాతగారి పెంపకంలో దేశభక్తిని నరనరాల్లో నింపుకుని పెరిగారు. సరిగ్గా ఆ పెంపకమే, హైస్కూల్ లో చదువుతున్న ఆయన్ను యుద్ధం వైపు ప్రేరేపించి ఉంటుంది.

• 19 ఏళ్ళ వయసులో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడంటేనే ఆయన కార్యదీక్ష, సంకల్పబలం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా అక్కడే మహాత్మ గాంధీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. వారిద్దరి స్నేహం దశాబ్దాల పాటు భారత స్వాతంత్ర సమరానికి ఓ దశను, దిశను చూపించింది.

• మద్రాస్ లో ప్లేగు ఇన్స్ పెక్టర్ గా, రైల్వేలో గార్డుగా పని చేసిన పింగళి వెంకయ్య గారు జపనీస్, సంస్కృతం, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. 1906లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరై, తన వాక్చాతుర్యంతో పలువురు ప్రముఖుల్ని ఆకట్టుకుని, విషయ నిర్ణాయక సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

• స్వాతంత్ర్య కాంక్షతో, యావత్ భారతం సమరశంఖం పూరిస్తున్న సమయంలో, పింగళి వెంకయ్య గారు అందులో భాగస్వాములయ్యారు. అన్ని సమావేశాల్లో బ్రిటీష్ యూనియన్ జాక్ జెండా ఎగరడం నచ్చక, భారతీయులకంటూ ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో జాతీయ పతాక రూపకల్పన దిశగా ఆలోచన చేశారు.

• భారత స్వరాజ్య సంగ్రామంలో కొందరు శాంతి మార్గాన్ని, మరికొందరు విప్లవ మార్గాన్ని ఎంచుకుంటే పింగళి వెంకయ్యగారు మాత్రం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా యావత్ భారతదేశాన్ని సంఘటితం చేసే మార్గాన్ని ఎంచుకోవడం ఆయన వైవిధ్య ఆలోచనలకు ప్రతీక.

• స్వతంత్రం సమరం వైపు యువతను ప్రేరేపించేందుకు ఆయన ప్రయత్నించారు. చైనాలో జాతీయ విప్లవాన్ని సాగించిన “సన్ యెట్ సెన్” జీవిత చరిత్రను రచించి, లండన్ టైమ్స్ పత్రిక ప్రశంసలు అందుకోవడమే కాదు, ఎన్నో దేశాల ప్రజల మనసుల్లో స్వాత్యంత్ర్య కాంక్షను రేకెత్తించారు.

• పింగళి గారి కృషిని, దీక్షాదక్షతల గురించి 1921 ఏప్రిల్ 13న గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో ప్రశంసించారు కూడా.

• భారతదేశ కీర్తి పతాకమైన మువ్వన్నెల జెండాను రూపొందించేందుకు పింగళి వెంకయ్యగారు భగీరథ ప్రయత్నమే చేశారు. ప్రముఖ జాతీయ నాయకులందరితో పలుమార్లు సమావేశమై, ముప్పైకి పైగా నమూనాలు తయారు చేశారు. గాంధీజీ సూచనలతో మువ్వెన్నెల పతాకానికి రూపకల్పన చేసి, జాతికి అంకితం చేసి, తన జీవితాన్ని సాఫల్య చేసుకున్నారాయన.

• పింగళి వెంకయ్యగారు రూపొందించిన త్రివర్ణపతాకానికి వెంటనే భారతజాతి ఆమోదం లభించలేదు. జెండాకు అడ్డంకులు సృష్టించేందుకు ఎన్నో స్వరాజ్య వ్యతిరేక శక్తులు ప్రయత్నించాయి. ఆ పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన ” ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా” (భారత దేశానికి జాతీయ పతాకం ) అనే గ్రంథాన్ని 1916 లో వెలువరించారు. ఒక జాతికి జెండా అవసరం గురించి సవిస్తరంగా ఇందులో వివరించారు. జాతీయ పతాకం ఆవశ్యకత నరనరాల్లో నింపి, వారిని స్వాతంత్ర్యం దిశగా ప్రేరేపించేందుకు నడుం బిగించారు.

• 1913 నుంచి పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా ఎలా ఉండాలన్న దానిపై అందరితో చర్చిస్తూ, అనేక రకాల నమూనాలను తయారు చేస్తూ వచ్చారు. మహాత్మ గాంధీ సలహాతో, చివరకు 1931లో కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉండి, మధ్యలో చరఖా ఉండే భారత స్వతంత్ర పోరాట జెండాకు ఆమోదం లభించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చరఖా స్థానంలో మన సంస్కృతికి చిహ్నంగా సారనాథ్ స్థూపం మీద ఉండే అశోక ధర్మచక్రం వచ్చి చేరింది.

• 1931లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం, ఆ తర్వాతి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించింది. దాదాపు ఒకటిన్నర దశాబ్ధం పాటు తెల్లదొరలకు నిద్ర లేకుండా చేసింది. దీనికి తోడు “ఝండా ఊంఛా రహే హమారా” అంటూ సుప్రసిద్ధ కవి శ్యాంలాల్ గీతం తోడై స్వరాజ్య ఉద్యమం మరింత ఊపందుకుంది.

• స్వరాజ్య సంగ్రామానికి కీలక ఘట్టంగా చెప్పుకునే క్విట్ ఇండియా ఉద్యమం నాటికి మువ్వన్నెల జెండాతో యావత్ భారతం తెల్లదొరతనం మీద శాంతియుత దండయాత్ర చేసింది.

• పింగళి వెంకయ్య గారికి “పత్తి వెంకయ్య” అనే మరో పేరు కూడా ఉంది. వ్యవసాయం పట్ల పింగళి గారికి అమితమైన ఆసక్తి ఉండేది. మునగాల రాజా నాయని రంగారావు బహద్దూర్ గారి సహకారంతో, ఖాదీ ఉద్యమంలో భాగంలో మునగాల వ్యవసాయ క్షేత్రంలో కంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి, సన్నని నూలును తయారు చేశారు. అలా ఆయన “పత్తి వెంకయ్య”గా పేరు గాంచారు. చెరకు, పొగాకు పంటల మీద పరిశోధన చేసి, “వ్యవసాయ శాస్త్రం” అనే గ్రంథాన్ని వెలువరించడం మాత్రమే కాదు, 1909లో తన పరిశోధనలకు బంగారు పతకం అందుకున్నారు కూడా.

• లండన్ రాయల్ అగ్రికల్చర్ సొసైటీ వారి అపూర్వ గౌరవ సభ్యత్వంతో పాటు, 1911 నుంచి 1919 వరకూ ఆంధ్ర జాతీయ కళాశాలలో వ్యవసాయ శాస్త్రంతో పాటు హిందూ దేశ చరిత్ర, గుర్రపు స్వారీ, వ్యాయామం లాంటి వాటిలో శిక్షణ ఇచ్చే వారు. అనంతరం సైనిక శిక్షణ ఇచ్చేందుకు తిరుచునా పల్లి వెళ్ళి, అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని తయారు చేశారు.

• ఒక ఉన్నత పరిశోధకునిగా పింగళి వెంకయ్య పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లొమా తీసుకున్నారు. అనంతరం నెల్లూరు చేరి, మైకా గురించి పరిశోధనలు చేశారు. వజ్రకరూర్, హంపిలో ఖనిజాలు, వజ్రాల గురించి విశేషంగా పరిశోధన చేసి ప్రపంచానికి తెలియని “వజ్రపు తల్లి రాయి” అనే గ్రంథాన్ని 1955లో ప్రచురించారు. రత్నగర్భ అనే భారతదేశ పేరు వెనుక నిజాల్ని ప్రపంచానికి తెలిపారు. 1960 వరకూ ఖనిజ పరిశోధక శాఖ సలహాదారునిగానూ పని చేశారు.

• సైనికుడిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, బహుబాషా కోవిదునిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా అన్నిటికీ మించి జాతీయ పతాక నిర్మాతగా ఆయన ఘనతలు ఓ ఎత్తైతే నిరాడంబర రాజకీయ వేత్తగా పింగళి వెంకయ్యగారు గడిపిన జీవితం మరో ఎత్తు.

• దేశం కోసం తన కర్తవ్యాన్ని నిర్వహించడమే తప్ప, తన కోసం ఏ రోజూ ఏదీ ఆశించని భరతమాత వారసుడు ఆయన. జాతికి జయకేతనాన్ని రూపొందించి ఇచ్చిన వెంకయ్య గారు ఏ రోజూ ఎవరి సాయాన్ని కోరలేదు. చివరకు మరణానికి చేరువైన రోజుల్లో కూడా, తన పార్థివ దేహం మీద జెండాను కప్పమని కోరిన నిస్వార్థ దేశభక్తుడు.

• పింగళి వెంకయ్య లాంటి వారిని గౌరవించుకోవడం అంటే, మన దేశ కీర్తి పతాకాన్ని గౌరవించుకోవడమే. భారతదేశ విజయాల్లో ఆయన సృష్టించిన మువ్వన్నెల జెండా, ఆయన స్పూర్తి నింపుకున్న భరతమాత ముద్దుబిడ్డలు తలఎత్తుకుని నిలబడినంత కాలం ఆయన కీర్తి అజరామరం.

• ఈ సందర్భంలో భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణన్ గారు మన త్రివర్ణ పతాకానికి ఇచ్చిన వివరణను మనమంతా గుర్తు చేసుకోవాలి.

• కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది స్వలాభావాన్ని విడిచి పెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది.

• తెలుపు రంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగునకు, సత్యానికి గుర్తు.

• ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధం, సమస్త జీవులకు వృక్ష సంపద ఆధారం అని చెప్పడానికి గుర్తు.

• అశోక చక్రం ధర్మ పాలనకు, చైతన్యానికి గుర్తు. భారతదేశం మార్పును స్వాగతిస్తూ ముందుకు పోవాలి అని చెప్పడానికి గుర్తు.

• జాతీయ జెండా రూపంలో మహోన్నత స్ఫూర్తిని, కులమతాలకతీతంగా జాతిని సంఘటితం చేసే శక్తిని అందించిన పింగళి వెంకయ్య లాంటి వారికి ఎలాంటి వివక్షలు లేని సమాజం ద్వారానే నిజమైన నివాళి అర్పించగలము.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*