చిత్తూరు జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లల్ని చంపి నదిలో పడేసిన కసాయి తండ్రి

బాలగంగనపల్లి: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లల్ని చంపి హంద్రి నీవా నదిలో పడేశాడు. కుటుంబ తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం బాలగంగనపల్లిలో ఈ ఘటన జరిగింది.

మృతులను పునీత్(5), సంజయ్(3), రాహుల్(2)గా గుర్తించారు. ఘటనా స్థలానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభం శుభం తెలియని చిన్నారులను నదిలో పడేసిన కసాయి తండ్రిపై అంతా కన్నెర్ర చేస్తున్నారు. ఎంత తగాదాలున్నా చిన్నారులను చంపుకోవడం ఏంటని అంతా మండిపడుతున్నారు.

పిల్లల తండ్రి వెంకటేశ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. తొలి భార్యకు పాప ఉంది. మరదలిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు మగపిల్లలు పుట్టారు. భార్యలిద్దరూ తరచూ గొడవపడుతుండటంతో వెంకటేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతజిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*