ఇంగ్లండ్‌పై భారత జట్టు ఓడిపోవడానికి కారణం అదే: గవాస్కర్

ముంబై: ఇంగ్లండ్‌పై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు తొలి టెస్ట్‌ను కోల్పోయింది. స్వల్ప తేడాతో తృటిలో మ్యాచ్‌ను చేజార్చుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. 200కి పైగా పరుగులు చేసినప్పటికీ భారత ఓటమిని ఆపలేకపోయాడు. అందుకు కారణం మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడమే.

ఒక్క కోహ్లీ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా పరుగులు చేయలేదు. బౌలింగ్‌లో అశ్విన్, ఇషాంత్ శర్మలు మంచి పాత్ర పోషించి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసినప్పటికీ కోహ్లీ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ దీనిపై స్పందించారు.

భారత జట్టు ఇంగ్లండ్‌తో ఈ టెస్ట్ సిరీస్‌ను ప్రారంభించడానికి ముందు భారత జట్టు సరైన వార్మప్ మ్యాచ్‌లు ఆడలేదని, అందువల్లే తొలి టెస్ట్‌లో విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. టెస్ట్ మ్యాచ్ భిన్నంగా ఉంటుందని, వైట్ బాల్‌తో ఊహించనంతగా స్వింగ్ కాదని, అదే రెడ్ బాల్ అయితే ఎక్కువగా స్వింగ్ అవుతుందని చెప్పారు.

వైట్ బాల్ ఆరు ఓవర్లకొకసారి స్వింగ్ అవుతుంది, కానీ రెడ్ బాల్ స్వింగ్ అవుతూనే ఉంటుంది. ఈ మొదటి టెస్ట్‌లో 40, 50 ఓవర్లలో కూడా బాల్ గాల్లో టర్న్ అవడం జరిగింది. అయితే లార్డ్స్‌లో జరిగే సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీసేన తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నట్టు గవాస్కర్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*