కేంద్ర మంత్రి సమక్షంలో టీడీపీ ఎంపీలు-జీవీఎల్‌ వాగ్యుద్ధం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో టీడీపీ ఎంపీలు- బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌‌తో వాగ్యుద్ధానికి దిగారు. గోయల్‌తో సమావేశమైన టీడీపీ ఎంపీలు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని కోరారు. 160 ఏళ్ల చరిత్రలో ఏనాడూ రాష్ట్రాల సరిహద్దులను పరిగణనలోకి తీసుకుని జోన్‌లు ఏర్పాటు చేయలేదని చెప్పారు. విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలపై పరిశీలించమని మాత్రమే ఉందని, అయినా తాము సంప్రదింపులు జరుపుతునే ఉన్నామని గోయల్ చెప్పారు. గడువు తేదీ గురించి స్పష్టంగా చెప్పలేమన్నారు.

గోయల్ వివరణ ఇస్తుండగా జీవీఎల్ అడ్డుకుంటున్నారంటూ టీడీపీ ఎంపీలు వాగ్యుద్ధానికి దిగారు. సమస్య వివరిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. రైల్వే మంత్రి టీడీపీ ఎంపీలను సముదాయించారు. రైల్వే మంత్రి వివరణకు నిరసనగా రైల్వే భవన్ వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. జీవీఎల్‌ను ఆంధ్రా ద్రోహి అని టీడీపీ ఎంపీలు, ఉత్తరాంధ్ర నేతలు ఆరోపించారు.

రైల్వే భవన్ వద్ద జరిగిన ఆందోళనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. ఫొటోలు జత చేశారు. తెలుగు ప్రజల భావోద్వేగాలను రైల్వే మంత్రి అర్ధం చేసుకోలేకపోయారని గల్లా మండిపడ్డారు.

 

ఏపీ విభజన హామీలు అమలయ్యే దాకా ధర్మపోరాటం కొనసాగుతుందని గల్లా ఫొటోలతో పాటు కామెంట్ పెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*