కరుణ అంత్యక్రియలపై హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే విషయంపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.రమేశ్ నివాసంలో విచారణ జరిగింది. మరో జడ్జి ఎస్ఎస్ సుందర్‌తో కలిపి ఆయన విచారణ జరిపారు.

మెరీనా బీచ్‌లోని అన్నా స్వ్యేర్ ప్రాంతంలో కరుణను ఖననం చేయాలని కరుణ కుటుంబ సభ్యులు కోరారు. అయితే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం సాధ్యం కాదని పళని స్వామి సర్కారు తేల్చి చెప్పింది. పర్యావరణ ఇబ్బందులు కూడా తలెత్తుతాయని తెలిపింది. గాంధీమండపం సమీపంలో రెండెకరాల స్థలం కేటాయిస్తామని స్పష్టం చేశారు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తే కరుణ స్మారక నిర్మాణానికి ఇబ్బందులుంటాయని ప్రభుత్వం తెలిపింది.

కరుణ అంత్యక్రియలు మెరీనాబీచ్‌లోనే జరపనివ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అన్నాదొరై సమాధి దగ్గరే కరుణ అంత్యక్రియలకు అవకాశం ఇవ్వాలని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సూచించారు. కరుణ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి రజినీ నివాళులర్పించారు.

అటు బుధవారం దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించాలని కేంద్రం ఆదేశించింది.

కరుణ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. మిగతా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు చెన్నై చేరుకున్నారు. కరుణ భౌతికకాయానికి నివాళులర్పించారు.

మరోవైపు ప్రధాని మోదీ కూడా కరుణ అంత్యక్రియలకు బుధవారం హాజరౌతారు. ఉదయం పది గంటలకు ఆయన చెన్నై వస్తారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చెన్నై అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. అంత్యక్రియలు ముగిసేవరకూ చెన్నైలో పెట్రోల్ బంకులు మూసివేయాలని ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*