కాసేపట్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నిక.. తీవ్ర ఉత్కంఠ..

కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలనేదే మా కోరిక: సుజనా చౌదరి

న్యూఢిల్లీ: మరికాసేపట్లో రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏ పార్టీ ఏ అభ్యర్ధికి మద్దతు ఇస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ హరి ప్రసాద్‌ను, ఎన్డీయే హరివంశ్ నారాయణ్ సింగ్‌ను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలని టీడీపీ కోరుకుంటోందని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. తమకున్న ఆరు రాజ్యసభ ఎంపీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి బీసీ అభ్యర్ధి అయినందుకే మద్దతిస్తున్నామని తెలిపారు.

అటు కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ టీడీపీ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే బీజేపీని దెబ్బతీసేందుకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులంటున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేయబోమని వైసీపీ తెలిపింది. టీడీపీ, బీజేపీ దొందు దొందేనని, రాజ్యాంగ పదవులు ఏకగ్రీవం కావాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. గైర్హాజరు అవుతామని చెప్పారు.

టీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతిస్తున్నట్లు ఇప్పటికే తేల్చి చెప్పింది. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్వయంగా ఫోన్ చేయడంతో కేసీఆర్ ఎన్డీయేకు మద్దతివ్వాలని నిర్ణయించారు.

అటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా నితీశ్ కుమార్ ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరడంతో ఓకే చెప్పారు. ఎన్డీయే అభ్యర్ధిగా బరిలోకి దిగిన జేడీయూకు చెందిన హరివంశ్‌కు ఓటేస్తామని తేల్చి చెప్పారు.

రాజ్యసభలో మొత్తం సభ్యులు 245
రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న సభ్యులు 244
మ్యాజిక్ నెంబర్ 123
సభలో హాజరు శాతాన్ని బట్టి మారే అవకాశం…

ఎన్డీయే బలం 126 (బీజేపీ 91, ఏఐడీఎంకే 13, బీజేడీ 9, టీఆర్ఎస్ 6, నామినేటెడ్ 3, ఇతరులు ఇద్దరు)
యూపీఏ బలం 109 (కాంగ్రెస్ 61, టీఎంసీ 13, ఎస్పీ 13, టీడీపీ 6, సీపీఎం 5, బీఎస్‌పి 4)

ఈ ఎన్నిక ఫలితాలు 2019 ఎన్నికల్లో కూటమి అవకాశాలను కూడా స్పష్టం చేస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*